ఆర్టీసీ కార్మికుల సమ్మె నివారించండి: సీఎం రేవంత్ కు కూనంనేని లేఖ!
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్ళకుండా చర్చలు జరిపి వారి డిమాండ్ల సాధనకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
విధాత, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్ళకుండా చర్చలు జరిపి వారి డిమాండ్ల సాధనకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కార్మికులు అనేక సమస్యలను ప్రస్తావిస్తూ..ఇప్పటికే సమ్మె నోటీసు యాజమాన్యానికి ఇవ్వడం జరిగిందని, ఏప్రిల్ 9వ తేదీన లేబర్ కమిషన్ వద్ద జరిగిన సమావేశానికి ఆర్టీసీ యాజమాన్యం రాకపోవడంతో తిరిగి 13వ తేదీకి సమావేశాన్ని వాయిదా పడిందని కూనంనేని గుర్తు చేశారు. ఈ సమావేశంలో సమస్యలు పరిష్కరించకపోతే కార్మికులు సమ్మెకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారని, సమ్మె నివారణకు రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు.
కూనంనేని లేఖ వివరాలు :
విషయము : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, పలు కార్మికుల ప్రధాన డిమాండ్లలతో కార్మికులు సమ్మెకు వెళ్లకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఏప్రిల్ 13వ తేదీన లేబర్ కమిషన్ వద్ద జరిగే సమావేశానికి ఆర్టీసీ యాజమాన్యం హాజరై సమ్మె నివారణకు చర్చలు జరిపి కార్మికుల సమస్యలు పరిష్కరించుట గురించి..
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. పలు దఫాలుగా చర్చలు జరిపినా వారి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. దీంతో కార్మికులు నిరవధిక సమ్మెకు వెళ్ళడానికి సిద్దంగా వున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం, రెండు వేతన సవరణల అమలు, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘ ఎన్నికల నిర్వహణ, కార్మికులకు ఉద్యోగ భద్రత, ప్రయాణీకుల సౌకర్యం కోసం కొత్త బస్సులు కొనుగోలు చేసి సంస్థను విస్తరిస్తామన్నారు. కానీ అలాంటి హామీలు ఏవీ అమలుకాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆర్టీసీలో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో అద్దె వాహనాలను తీసుకొస్తున్నారు. ఈ బస్సులో పనిచేస్తున్న డ్రైవర్స్ కు ఆర్టీసీకి సంబంధం లేదు. ఈ బస్సుల మీద ప్రభుత్వ ఇస్తున్న సబ్సిడీ ప్రైవేట్ వ్యక్తులకే చెందుతున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వం తీసుకొని ఆర్టీసీకి ఇవ్వడం వలన ఆదాయం కూడా సంస్థకు చెందుతున్నది. ఆర్టీసీలో ప్రైవేట్ గుత్తాధిపత్యం కూడా తగ్గుతుంది.
గత 11 సంవత్సరాలుగా ఆర్టీసీలో నియామకాలు లేకపోవడం వలన పని భారాన్ని ఉన్న ఉద్యోగులే భరించాల్సివస్తుంది. దీంతో కార్మికులు తీవ్ర అనారోగ్యాలుకు గురైతున్నారు. అంతేగాకుండా పిఎఫ్‌కు సంబంధించి ఉద్యోగస్థుల నుండి రికవరి చేసిన సుమారు 1200 కోట్ల రూపాయలను యాజమాన్యం రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్‌కు పంపకపోవడం వలన చాలా మంది ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్లు గత 5 సంవత్సరాలుగా విడుదల కాలేదు. కార్మికులు అనేక సమస్యలు సమ్మె నోటీసులో యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 9వ తేదీన లేబర్ కమిషన్ వద్ద జరిగిన సమావేశానికి ఆర్టీసీ యాజమాన్యం రాకపోవడంతో తిరిగి 13వ తేదీకి సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది. ఈ సమావేశంలో సమస్యలు పరిష్కరించకపోతే కార్మికులు సమ్మెకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారు.
కావున ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్ళకుండా చర్చలు జరిపి వారి డిమాండ్ల సాధనకు ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిందిగా తమరిని కోరుతున్నానని కూనంనేని సాంబశివరావు తన లేఖలో పేర్కొన్నారు. లేఖ ప్రతులను రవాణ శాఖ మంత్రి ప్రభాకర్ కు, ఆర్టీసీ చైర్మన్ వై.నాగిరెడ్డికి పంపిస్తున్నట్లుగా తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram