KTR| కొత్తగూడెంలో మద్దతిస్తాం.. తీసుకోండి : సీపీఐకి కేటీఆర్ బంపర్ ఆఫర్

కొత్తగూడెం కార్పోరేషన్ లో హంగ్ పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో సీపీఐ పార్టీ మేయర్ పీఠం దక్కించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ మద్దతునివ్వడానికి సిద్దంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

విధాత : కొత్తగూడెం కార్పోరేషన్ లో హంగ్ పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో సీపీఐ పార్టీ మేయర్ పీఠం దక్కించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ మద్దతునివ్వడానికి సిద్దంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. మా మద్దతు తీసుకుని సింగరేణిలో అక్రమాలకు పాల్పడిన కాంగ్రెస్ కు గుణపాఠం నేర్పాలని సీపీఐ నేత, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కోరారు.

సింగరేణిలో జరుగుతున్న బొగ్గు కుంభకోణంపై అడ్డుకట్ట వేయాలంటే మేము మీతో కలిసి వస్తామని చెప్పి నేను కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావుతో మాట్లాడటం జరిగింది అని కేటీఆర్ శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీని అడ్డుకోవడానికే ఈ ఆఫర్ మేము సీపీఐకి ఇచ్చాం అని కేటీఆర్ తెలిపారు. సింగరేణి సంస్థలో సీఎం రేవంత్ రెడ్డి బావమర్థి అక్రమాలను మేం బయటపెట్టినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

116మున్సిపాలిటీలలో ప్రత్యక్షంగా బీఆర్ఎస్ పార్టీ దాదాపు 15, 16 నేరుగా గెలుస్తుందని, పరోక్షంగా మరో 10, 15 చోట్ల గెలుపొందే అవకాశాలు ఉన్నాయని మాకు సమాచారం ఉంది కేటీఆర్ తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు విరోచితంగా పోరాడారు అని, 2581 మున్సిపల్ వార్డులలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ 750 వార్డులు గెలిచింది అన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో 40% స్థానాలు గెలుచుకున్నాం.. ఇప్పుడు 30% పైగా వార్డులు గెలుచుకున్నాం అని తెలిపారు. 2020లో 130 మేయర్లకు, చైర్ పర్సన్లకు మున్సిపల్ ఎన్నికలు జరిగితే అందులో బీఆర్ఎస్ పార్టీ 122 గెలిస్తే, కాంగ్రెస్ 4, బీజేపీ 2, ఎంఐఎం 2 గెలిచింది అని, ఈ లెక్కన మేం ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ తో పోల్చితే మెరుగైన ప్రజాదరణ, ఫలితాలు పొందామని వెల్లడవుతుందన్నారు.  త్వరలో జరిగే గ్రేటర్ హైదరాాద్ కార్పోరేషన్లలో, మండల, జిల్లా పరిషత్ లలో కూడా బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించబోతుందన్నారు.

మున్సిపాల్టీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన చోట కూడా అధికారులను, అధికార యంత్రాంగాన్ని, అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని గెలిచినామా అంటే గెలిచినట్లు గెలిచింది అని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య ఓట్ల అంతరం చాల స్వల్పంగా ఉందన్నారు. మేం గెలుచుకోబోతున్న మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగంతో అక్రమాలతో గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతుందన్నారు.

ప్రజాదరణ ఉంటే 10మంది ఎమ్మెల్యేలతో ఉప ఎన్నికలకు రండి

పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిపి ప్రజాదరణ చాటుకున్నామంటున్న కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే 10మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలలో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు సిద్దం కావాలని కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. నేనే రాజు, నేనే మంత్రి అని విర్రవీగిన వారెందరో ప్రజాతీర్పులో కొట్టుకపోయారని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.

Latest News