విధాత, హైదరాబాద్ : ఢిల్లీలో బ్రిటీష్ హయాంలో నిర్మించిన సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ భవనాలను ఇక నుంచి దేశంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు చర్చించుకునే అవకాశం లేకుండా పోయింది. 99 సంవత్సరాల క్రింత నిర్మించిన ఈ రెండు బ్లాకులు ఇప్పటి వరకు కేంద్రంలోని ప్రముఖ పెద్దల కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచాయి. సౌత్ బ్లాక్ లో ప్రధాన మంత్రి కార్యాలయం, నార్త్ బ్లాక్ లో హోం మంత్రి కార్యాలయాలు పనిచేస్తుండేవి. సౌత్ బ్లాక్ నుంచి ప్రధాన మంత్రి కార్యాలయం శుక్రవారం అధికారికంగా తరలించనున్నారు. నూతనంగా నిర్మాణం చేసిన సేవా తీర్థ్ కాంప్లెక్స్ లో ప్రధాన మంత్రి కార్యాలయం ఏర్పాటు కానున్నది. సౌత్ బ్లాక్ ను ఖాళీ చేయడానికి కొద్ది గంటల ముందు అదే బ్లాక్ లోని మెజెస్టిక్ రైసినా హిల్స్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చివరి మంత్రి మండలి సమావేశం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 13వ తేదీన సేవా తీర్థ్, కర్తవ్య భవన్ -1, కర్తవ్య భవన్ -2 ను నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
నార్త్ బ్లాక్ లోని కేంద్ర హోం మంత్రి కార్యాలయాన్ని కూడా కామన్ సెంట్రల్ సెక్రెటేరియట్ లోకి మార్చనున్నారు. 347 గదులతో అత్యాధునికంగా ఈ కాంప్లెక్స్ ను నిర్మాణం చేశారు. ఈ కాంప్లెక్స్ లోనే మిగతా మంత్రుల కార్యాలయాలు, విభాగాలు పనిచేయనున్నాయి. ఢిల్లీలో ప్రస్తుతం పలు ప్రాంతాలలో మంత్రులు, వారి కార్యాలయాలు, పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన కార్యాలయాలు పని చేస్తున్నాయి. దీని మూలంగా అనేక ఇబ్బందులు తలెత్తుతూ, సమావేశాల నిర్వహణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. సమయాభావం మూలంగా సమన్వయం చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. రాజకీయ నాయకులు, అధికారులు, సందర్శకులకు సంకటంగా ఉంది. ఇప్పటి వరకు వేర్వేరు ప్రాంతాలలో ఉన్న ప్రధాన మంత్రి కార్యాలయం, నేషనల్ సెక్యురిటీ కౌన్సిల్ సెక్రెటేరియట్, క్యాబినెట్ సెక్రెటేరియట్ లు ఇక నుంచి సేవతీర్థ్ భవనం నుంచి కొనసాగనున్నాయి. కర్తవ్య భవన్ లలో ఆర్థిక, రక్షణ, వైద్య, ఆరోగ్య, కార్పొరేట్ వ్యవహారాలు, విద్య, న్యాయ, సమాచార, ప్రసార, వ్యవసాయ, గిరిజన, రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖల మంత్రుల కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ భవనాల ప్రవేశ ద్వారం వద్ద భారీ రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. మంత్రులు లేదా వారి వ్యక్తిగత సిబ్బందిని కలిసేందుకు వీలుగా రిసెప్షన్ ను తీర్చిదిద్దారు. సిబ్బంది పనిచేసుకునేందుకు వీలుగా, సందర్శకులకు ఇబ్బందులు లేకుండా సువిశాల వాహన పార్కింగ్, పర్యావరణ హిత విధానాలతో ఈ భవనాలను నిర్మాణం చేశారు. ఖాళీ అయిన సౌత్, నార్త్ బ్లాక్ లలో ప్రపంచంలోనే అతి పెద్ద యుగే యుగీన్ భారత్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నార్త్ బ్లాక్ లో మ్యూజియం పనులు ప్రారంభించారు.
1947 లో సౌత్, నార్త్ బ్లాక్ ల నిర్మాణం
బ్రిటీష్ ప్రభుత్వం తమ కార్యకలాపాల కోసం సౌత్, నార్త్ బ్లాక్ భవనాలను నిర్మాణం చేసింది. ఈ బ్లాక్ లకు హెర్బర్ట్ బెకర్ డిజైన్ అందించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1947 సంవత్సరం నుంచి ఈ బ్లాకుల నుంచి ప్రధాన మంత్రి, హోం మంత్రి తమ కార్యకలాపాలను ప్రారంభించారు. సౌత్ బ్లాక్ లో ప్రధాన మంత్రి, విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖ మంత్రుల కార్యాలయాలు ఉండగా నార్త్ బ్లాక్ లో హోం మంత్రి, ఆర్థిక శాఖ మంత్రుల కార్యాలయాలు ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సౌత్ బ్లాక్ లో అనేక కీలక నిర్ణయాలతో పాటు మంత్రి మండలి సమావేశాలు జరిగాయి. ఈ బ్లాక్ నుంచే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. తొలుత 2014 సంవత్సరంలో మొదటి మంత్రి మండలి సమావేశంలో విదేశాల్లో నల్లధనం వివరాలు వెలుగులోకి తెచ్చేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేట్ టీమ్ (సిట్) ఏర్పాటు చేస్తూ తీర్మానం చేశారు. 2016 లో పెద్ద నోట్ల రద్దు ప్రకటించారు. 2016 లో జమ్మూ కశ్మీర్ యూరి సెక్టార్ లో 19 మంది సైనికుల పై ఉగ్రవాదులు దాడి చేయడంతో, ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసి పాకిస్థాన్ సరిహద్దుల వద్ద సర్జికల్ స్ట్రైక్ కు ఆదేశించారు. 2019 సవత్సరంలో పుల్వామాలో ఉగ్రవాదులు దాడి చేసి 40 మంది సీఆర్పీఎఫ్ బలగాల చావు కు కారణం కావడంతో పాకిస్థాన్ లోని బాలాకోట్ లో జేషే మహ్మద్ ఉగ్రవాద శిబిరంపై దాడులకు ఆదేశించారు. మూడోసారి ప్రధాని అయిన తరువాత 2024 లో కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత సాయాన్ని విడుదలు చేశారు.
ఇవి కూడా చదవండి :
Papaya Benefits | బొప్పాయితో బోలెడు లాభాలు..! మరి షుగర్ పేషెంట్లు తినొచ్చా..?
Elderly Woman | ఫుట్‌పాత్‌పై వాహనం నడిపేందుకు యత్నించిన బైకర్‌ను ధైర్యంగా అడ్డుకున్న వృద్ధురాలు.. VIDEO
