Rythu Bharosa : ఈ నెల 17 లేదా 18వ తేదీ నుంచి..రైతుల ఖాతాల్లో భరోసా సొమ్ములు..

ఫిబ్రవరి 17 లేదా 18 నుంచి రైతు భరోసా సాయం జమకు సిద్ధం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలపై రైతుల ఖాతాల్లో నిధులు. కొత్త దరఖాస్తులపై ఇంకా స్పష్టత లేదు.

Rythu Bharosa

విధాత, హైదరాబాద్ :  తెలంగాణ రైతాంగం ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా సాయం సొమ్ములు ఫిబ్రవరి 17వ తేదీ లేదా 18వ తేదీ నుంచి వారి బ్యాంకు ఖాతాల్లో వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్ర ఆర్థిక శాఖ రైతు భరోసా పథకానికి అవసరమైన నిధులను ఇప్పటికే సమకూర్చుకున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ఆదేశాలు రాగానే బ్యాంకు ఖాతాల్లో సాయం సొమ్ములు జమ చేయున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం, ప్రజల నుంచి సానుకూలత ఉండడంతో మార్చి నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉంది. ఈ నెలాఖరు కు పరిషత్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

గత వానాకాలంలో (2025-26 ఖరీఫ్ సీజన్) 69,39,548 మంది లబ్ధిదారుల ఖాతాలలో రైతు భరోసా సాయం వేశారు. ఒక ఎకరా కు రూ.6 వేల చొప్పున మొత్తం రూ.8,744.13 కోట్లు బదిలీ చేశారు. తొలి రోజు ఒక ఎకరా నుంచి ప్రారంభించి మొత్తం తొమ్మిది రోజుల పాటు ఈ మొత్తాన్ని వారి వారి ఖాతాల్లో జమ చేశారు. వీరందరికీ ఈసారి కూడా బదిలీ చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేశారు. బోగస్ లబ్ధిదారులను ఏరివేసేందుకు హైదరాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శాటిలైట్ సర్వే నిర్వహించారు. ఎక్కడ సాగు భూమి ఉంది, బోగస్ లబ్ధిదారులు ఎవరు అనే వివరాలతో ఇటీవలే వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి నివేదిక పంపించింది. ఈ సర్వేతో ఏమాత్రం సంబంధం లేకుండా వానాకాలంలో రైతు భరోసా అమలు చేసిన వారందిరికీ, ఈసారి కూడా అమలు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వానాకాలంలో 1.46 కోట్ల ఎకరాల భూములకు రైతు భరోసా చెల్లించారు. యాసంగిలో కూడా 1.46 కోట్ల ఎకరాలకు వర్తింప చేయనున్నారు. అయితే ఇందుకు అవసరం అయ్యే నిధులు సమకూర్చుకునేందుకు ఈ నెల 10వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.9వేల కోట్ల రుణం తీసుకున్నది. మున్సిపల్ ఎన్నికల కోడ్ ఈ నెల 16వ తేదీతో ముగియనున్నందున 17 లేదా 18వ తేదీ నుంచి రైతుల ఫోన్ నెంబర్లకు టింగ్ టింగ్ మంటూ మెస్సేజీలు రానున్నాయి. జనవరి నెల సంక్రాంతి పండుగ ముందే ఈ మొత్తాన్ని జమ చేయాల్సి ఉండగా నిధుల లభ్యత లేకపోవడంతో ఈ నెలకు వాయిదా పడింది.

వానాకాలం తరువాత పలు జిల్లాల్లో వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు జరిగాయి. కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారికి నమోదు కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. పలువురు రైతులు మండల వ్యవసాయ అధికారి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే తప్ప కొత్తవారి దరఖాస్తులు స్వీకరించే పరిస్థితి లేదని అధికారులు చెప్పి పంపిస్తున్నారు. ఎప్పటి నుంచి కొత్త దరఖాస్తులు స్వీకరిస్తారనేది రైతులు చర్చించుకుంటున్నారు. వానాకాలం నుంచి ఇప్పటి వరకు ఏ తేదీని కటాప్ గా తీసుకుని నమోదు చేస్తారనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి :

Zimbabwe Beat Australia | జింబాబ్వే పెను సంచలనం : ఆస్ట్రేలియాను చిత్తు చేసిన వైనం
Seva Teerth : 99 ఏళ్ల తరువాత సౌత్, నార్త్ బ్లాక్ ఖాళీ..సేవా తీర్థ్ లోకి ప్రధాని కార్యాలయం

Latest News