ఏరువాక పౌర్ణమి.. దుక్కి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం

ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులతో కలిసి దుక్కి దున్ని విత్తనాలు చల్లి సందడి చేశారు. హుస్నాబాద్ కొహెడ మండలంలో ఏరువాక పౌర్ణమి వేడుకలలో మంత్రి పొన్నం పాల్గొని.. నాగలి పట్టి దుక్కి దున్ని విత్తనాలు చల్లి వ్యవసాయ పనులు ప్రారంభించారు .

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jun 29, 2026, 12:45 pm IST
Read Time: 9 mins
ఏరువాక పౌర్ణమి.. దుక్కి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం

ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులతో కలిసి దుక్కి దున్ని విత్తనాలు చల్లి సందడి చేశారు. హుస్నాబాద్ కొహెడ మండలం కూరెళ్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమి వేడుకలలో మంత్రి పొన్నం పాల్గొని.. రైతులతో కలిసి నాగలి పట్టి దుక్కి దున్ని విత్తనాలు చల్లి ఖరీఫ్ పంట వ్యవసాయ పనులు ప్రారంభించారు . పవిత్రమైన ఏరువాక పౌర్ణమి రోజున భూమాత ఆశీర్వాదంతో ప్రతి రైతు కుటుంబం ఆనందంగా ఉండాలని, ఈ ఖరీఫ్ సీజన్లో తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులు పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రైతాంగానికి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతాంగ సంస్కృతికి ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. రైతులు కొత్త వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ భూమాతకు, ప్రకృతికి నమస్కరించి మంచి పంటలు పండాలని ఆకాంక్షించే పవిత్రమైన రోజు ఇదన్నారు. “అన్నం పరబ్రహ్మ స్వరూపం” అని మన పెద్దలు చెప్పారని, ఆ అన్నాన్ని పండించే రైతే దేశానికి వెన్నెముక అని మంత్రి అన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి అన్ని పంటలు క్రిమి, కీటకాల బెడద లేకుండా సమృద్ధిగా పండాలని, రైతులకు ఆర్థికంగా మంచి రాబడి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ప్రతి రైతు కుటుంబం భూమాత ఆశీర్వాదంతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన మంత్రి, రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కట్టుబడి పనిచేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి వసతుల మెరుగుదల, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని మంత్రి వివరించారు. రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయాలని, వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ నాణ్యమైన విత్తనాలను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. నీటిని పొదుపుగా వినియోగిస్తూ ప్రకృతి అనుకూల వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అధిక దిగుబడులు సాధించే దిశగా రైతులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

అనంతరం కొహెడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించారు. కోహెడలో ఓటరు సవరణ ప్రక్రియను పరిశీలించారు. అర్హత ఉన్న ఒక ఓటు కూడా పోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎరువుల యాప్ రావడంతో.. రైతులకు ఎరువులు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కలెక్టర్ కి సూచించడం జరిగిందని తెలిపారు. ఎరువుల తయారీ రాష్ట్రాల చేతిలో లేదు.. కేంద్రం ఇస్తేనే మనం పంపగలగుతున్నాం అన్నారు. ఎరువులు ఎంత అవసరమో అంతే వేయాలని కేంద్రం సూచిస్తుందని, ఎరువుల , విత్తనాలు సరఫరాలో ఇబ్బందులు వస్తే అధికారులతో మాట్లాడి మన సర్పంచ్ లు సమన్వయం చేయాలని సూచించారు. రైతులకు ఉచిత విద్యుత్తు, రైతు భరోసా అందిస్తున్నామని, రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. కేంద్రం సహరించకపోయినా..రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూశాం అని, సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నామని తెలిపారు.

మండలంలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు నడుస్తున్నాయని తెలిపారు. బస్వాపూర్ నుండి తంగళ్లపల్లి రామచంద్రపురం రోడ్లు మంజూరు అయ్యాయని, హుస్నాబాద్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. హుస్నాబాద్ నియోకవర్గంలో మొదటి దశలో 3500 ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయని, రెండవ దశలో వస్తున్నాయని తెలిపారు. గతంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అని, మేము అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇచ్చాం.. సన్న బియ్యం ఇస్తున్నాం అని తెలిపారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం అని గుర్తు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, 30నెలల కాంగ్రెస్ పాలన, పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ఎక్కడైనా తాము చర్చకు సిద్దం అని స్పష్టం చేశారు.