హైలైట్స్:
- శంషీగూడలో 112 ఎకరాల భూ కుంభకోణం
- హైడ్రాతో అక్రమ నిర్మాణాలు కూల్చేయాలి
- సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ ఫిర్యాదు
- సొంత సోదరుడిపైనే లేఖ రాసిన కేశినేని నాని
విధాత, హైదరాబాద్:
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), వారి కుటుంబ సభ్యులతో సంబంధం ఉన్న మెస్సర్స్ ఎక్సెల్లా ప్రాపర్టీస్ సంస్థ భారీ భూ ఆక్రమణ వ్యవహారాన్ని అడ్డుకోవాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని పూర్తి ఆధారాలతో కూడిన వినతిపత్రాన్ని పంపించారు. మేడ్చల్ మల్కాజిరిగి జిల్లా కూకట్‌పల్లి మండలం, ప్రగతి నగర్ సమీపంలోని శాంషీగూడ గ్రామం, సర్వే నెంబర్-57 పరిధిలో ప్రతిష్టాత్మక టీజీఐఐసీ ఐటీ పార్క్ కోసం 112.72 ఎకరాలు కేటాయించింది. అయితే ఈ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ భూమికి సంబంధించిన వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విధించిన యాక్టివ్ ఫ్రీజ్ ఆదేశాలు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇన్‌సాల్వెన్సీ పరిమితులను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాకుండా లోలోపల కుట్రలు జరుగుతున్నాయన్నారు. ప్రైవేట్ రాజీ పిటిషన్ల ద్వారా కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందని వినతిపత్రంలో ఆరోపించారు.
ఈ భూములకు సంబంధించి మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. శాంషీగూడలోని 112.72 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వ పోరంబోకు భూమి అని, దానిపై ఎలాంటి ప్రైవేట్ హక్కులు లేవని స్పష్టంగా సుప్రీంకోర్టుకు విన్నవించారు. నాగమ్మ టెంపుల్ సమీపంలో భారీ యంత్రాలతో బారికేడ్లు ఏర్పాటు చేసి భూమిని ఆక్రమించే ప్రయత్నాలు జరిగాయని కేశినేని నాని తెలిపారు. రికార్డుల ప్రకారం ప్రభుత్వ పోరంబోకు భూమి అయినందున హైకోర్టు ఏజీ ద్వారా సుప్రీం కోర్టులో ప్రభుత్వ తరఫున ఇంటర్వెన్షన్ అప్లికేషన్ దాఖలు చేసి ప్రైవేట్ రాజీ పిటిషన్లను అడ్డుకోవాలని ఆయన కోరారు. అలాగే హైడ్రా కమిషనర్ కు తక్షణ ఆదేశాలు జారీ చేసి శాంషీగూడ ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడ వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని ముఖ్యమంత్రిని కోరారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారిపై సైబరాబాద్ పోలీసుల ద్వారా క్రిమినల్ కేసులు పెట్టాలని, చీటింగ్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేశినేని నాని సీఎం రేవంత్ రెడ్డిని తన లేఖలో కోరారు.