దానం, కడియం, తెల్లంపై వేటుకు బీఆరెస్ పిటిషన్
విధాత, హైదరాబాద్: బీఆరెస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలంటూ బీఆరెస్ దాఖలు చేసిన పిటిషన్ విచారణను హైకోర్టు ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది. బీఆరెస్ అనర్హత పిటిషన్‌కు విచారణ అర్హత లేదని అడ్వకేట్ జనరల్ వాదించారు. బీఆరెస్ తరపు న్యాయవాదులు పార్టీ మారిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల చట్టంపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అనుసరించి దానం, కడియం, వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని వాదించారు.
ఈ మేరకు స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోరారు. వాదనల అనంతరం కేసు విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటిదాకా బీఆరెస్ నుంచి 7గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోగా, మరో 20మంది వరకు ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అటు బీఆరెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఇటీవల ఒకేసారి కాంగ్రెస్‌లో చేరారు. మరికొంతమంది బీఆరెస్ ఎమ్మెల్సీలు కూడా చేరనున్నట్లుగా సమాచారం.