ఆయనే నన్ను వేధిస్తున్నారని భార్య ఫిర్యాదు
విధాత, హైదరాబాద్ : తన భార్య నుండి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని… రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకున్నారు. పెళ్ళైనప్పటి నుండి తనను మానసికంగా , శారీరకంగా హింసిస్తుందని బాధితుడు ఆల్వాల్ పోలీస్ స్టేషన్ ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ మీడియాతో తన గోడును చెప్పుకున్నాడు. ఏపీ రాజోలుకు చెందిన టెమూజియన్ కు అమలాపురంకు చెందిన లక్ష్మీ గౌతమితో ఏడేళ్ల క్రితం పెళ్లి జరగగా వారికి ఐదు సంవత్సరాల కుమారడు ఉన్నాడు. మల్లారెడ్డి కాలేజీలో టెమూజియన్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు.
అయితే పెళ్లైనప్పటి నుండి తనను నా భార్య అకారణంగా హింసిస్తుందని, పలుమార్లు పెద్దవాళ్ళ సమక్షంలో మాట్లాడినా ఆమె తీరు మారలేదన్నారు. ఇటీవల తనను చంపేందుకు కత్తితో దాడి చేసినట్లు తెలిపాడు. ఈ విషయంపై స్థానిక అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఒక చట్టం, పురుషులకు ఒక చట్టం ఉంటుందా అని ప్రశ్నించారు. తాను నిన్నటి నుండి ఇంటికి వెళ్లలేదని, వెళ్తే తన భార్య మళ్ళీ దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. పోలీసులు తన భార్యపై కేసు నమోదు చేసి, తనకు రక్షణ కల్పించాలని బాధిత భర్త వేడుకున్నాడు.
అతనే నన్ను వేధిస్తున్నాడు
టెమూజియన్ చేసిన ఆరోపణలపై ఆయన భార్య లక్ష్మిగౌతమి సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదంలో ఆసక్తికర అంశాలు బయటపెట్టారు. తన భర్తకు స్టార్ మేకర్ అనే యాప్ లో ఒక అమ్మాయి పరిఛయమైందని ఆమెతో ఎఫైర్ మొదలైనప్పటి నుంచి మా మధ్య గొడవలు జరుగుతున్నాయని ఆరోపించింది. ఒక దశలో ఆ అమ్మాయి కూడా ఆమెను బెదిస్తున్నారంటూ నా భర్త పై రామగుండం పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిందన్నారు. ఆయన ఫోన్ కాల్ రికార్డులు, చాటింగ్ లిస్టు చూస్తే అంతా తెలుస్తుందన్నారు. ఆయనకు నా నుంచి డైవర్స్ కావాలని అందువల్లే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
ఆస్తి కోసం ఇబ్బంది పెడుతున్నాననే మాట అవాస్తమని తమ వైపు కుటుంబానికి కూడా మంచి ఆస్తిపాసులు ఉన్నాయని చెప్పారు. కత్తితో నేను ఆయనపై దాడి చేశానని చెప్పడం అబద్ధమని, నామీద హత్యాయత్నం చేస్తే డిఫెన్స్ చేసుకునే క్రమంలో కొన్ని గాయాలయ్యాయని, తాను ఎలాంటి వేధింపులకు పాల్పడలేదన్నారు. నిజానికి ఆయనే తనను వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇరువురి ఫిర్యాదులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.