Site icon vidhaatha

దూరం దూరం.. ఇంటిగ్రేటెడ్‌!..అభ్యంతరం చెబుతున్న ప్రజలు

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 21 (విధాత‌): ప్ర‌జ‌ల‌కు స‌మీపంలో, నిత్యం అందుబాటులో ఉండాల్సిన‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఆధునిక సొబగుల మాటున ప్ర‌జ‌ల‌కు దూరం అవుతున్నాయా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ జ‌రిగి ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల్సిన అధికార వ్య‌వ‌స్థ‌, కార్యాయాలు ఇంటిగ్రేటెడ్ ప‌దం మాటున అంద‌నంత దూరం వెళుతున్నాయి. తాజాగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం ఆదాయాన్నిచ్చే స‌బ్ రిజిస్ట్రార్‌ కార్యాల‌యాల‌కు సొంత భ‌వ‌నాలు లేవ‌ంటూ.. ఆధునిక సౌక‌ర్యాల‌తో ఇంటిగ్రేటెడ్ స‌బ్ రిజిస్ట్రార్‌ కార్యాల‌యాలు నిర్మిస్తున్నది. అయితే ఇంటిగ్రేటెడ్ పేరుతో నాలుగు ప్రాంతాల కార్యాల‌యాల‌ను ఒకేచోట ఏర్పాటు చేస్తే ఒకే ప్రాంత ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర అవుతుంది కానీ, మిగ‌తా ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు దూరం కాదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయాన్నిచ్చే స‌బ్ రిజిస్టార్ కార్యాల‌యాల‌ను అద్దె భ‌వ‌నాల్లో నిర్వ‌హించ‌డం స‌రైన ప‌ద్ద‌తి కానప్పటికీ.. స్వంత భ‌వ‌నాల పేరిట దూర ప్రాంతాలకు తరలించడం ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే అవుతుందనే అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్న‌ది.

సంగారెడ్డితో స‌హా ఔట‌ర్ రింగ్ రోడ్డు లోప‌ల, బ‌య‌ట‌ ఉన్న‌ 39 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు 11 చోట్ల భ‌వ‌నాలు నిర్మించి వాటిల్లోకి త‌ర‌లించాల‌న్న‌ నిర్ణ‌యం ప్ర‌జ‌ల‌కు రిజిస్ట్రేష‌న్ సేవ‌ల‌ను దూరం చేయ‌డ‌మేన‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఒక‌రు అన్నారు. ఆధునిక సౌక‌ర్యాలు ఉండాలి.. ఆ కార్యాల‌యాలు ఏ ప్రాంతానికి చెందిన‌వి ఆ ప్రాంతంలోనే ఉండాల‌ని అంటున్నారు.

గ‌తంలో తాలూకా వ్య‌వ‌స్థ ఉండేది. మారుమూల ప్రాంతానికి చెందిన గ్రామాల ప్ర‌జ‌లు తాలూకా కేంద్రానికి రావ‌డం ఇబ్బంది అవుతుంద‌ని భావించి అప్ప‌టి ముఖ్య‌మంత్రి ఎన్టీ రామారావు మండ‌ల వ్య‌వ‌స్థ‌ను తీసుకు వ‌చ్చారు. మండ‌ల వ్య‌వ‌స్థ బ్ర‌హ్మండంగా స‌క్సెస్ అయింది. మండ‌ల స్థాయిలో ప్ర‌జ‌ల‌కు రెవెన్యూతో పాటు ఇత‌ర విభాగాల సేవ‌లు అద్భుతంగా అందాయి. ఒక తాసిల్దార్ మారుమూల గ్రామానికి వెళ్ల‌డానికి ఎంతో స‌మ‌యం ప‌ట్టేది కాదు. మండ‌ల కేంద్రంలో వైద్య స‌దుపాయాలు కూడా అందుబాటులోకి వ‌చ్చాయి. కేసీఆర్ తెలంగాణకు ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత జిల్లా కేంద్రాలు దూరంగా ఉన్నాయ‌ని భావించి జిల్లాల పున‌ర్విభ‌జ‌న చేశారు. 10 జిల్లాల స్థానంలో 33 జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. చిన్న జిల్లాల ఏర్పాటుతో జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను మూరుమూల గ్రామాల ప్ర‌జ‌లు క‌లిసే వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. జిల్లా కేంద్రాలు పెర‌గ‌డంతో ఇది అర్బ‌నైజేష‌న్‌కు దారి తీసింది. అయితే కేసీఆర్ అందుబాటులో ఉన్న గ్రామ స్థాయి రెవెన్యూ అధికారుల వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయ‌డం, తాసీల్దార్ల‌కు ఉన్నఅధికారాల‌ను తొల‌గించ‌డం ద్వారా స‌మ‌స్య‌ల ప‌రిష్కారాన్ని జ‌టిలం చేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. జిల్లాల ఏర్పాటును ఎంత‌గా హ‌ర్షించారో ధ‌ర‌ణిపై అంత వ్య‌తిరేక‌త మూట క‌ట్టుకున్నారు.
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కొత్త‌గా ఏమైనా చేయాల‌నుకేంటే ఒక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ద‌గ్గ‌ర‌గా ఉండేలా చేయాల‌ని కానీ, ప్ర‌జ‌ల‌కు దూరం అయ్యేలా చేయ‌కూడ‌ద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కుడొక‌రు అన్నారు. సౌక‌ర్యాలు క‌ల్పించండి… స్వంత కార్యాల‌యాలు నిర్మించండి కానీ, ఆ పేరుతో మూడు నాలుగు ప్రాంతాల కార్యాల‌యాలు ఒకే చోట‌కు తీసుకు రావ‌డం స‌రికాద‌ని చెపుతున్నారు.

Exit mobile version