కేసీఆర్‌ పోరు బాటతో ఆ పార్టీకి లాభమా? నష్టమా?

ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరు బాట పట్టిన కేసీఆర్‌ పర్యటనల వల్ల ఏ పార్టీకి నష్టం జరుగుతుంది? వాళ్ల పార్టీకి ఎంత మేరకు లాభం చేకూరుతుంది?

  • Publish Date - April 8, 2024 / 03:40 PM IST

విధాత‌: ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరు బాట పట్టిన కేసీఆర్‌ పర్యటనల వల్ల ఏ పార్టీకి నష్టం జరుగుతుంది? వాళ్ల పార్టీకి ఎంత మేరకు లాభం చేకూరుతుంది? ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేసీఆర్‌ చేస్తున్న విమర్శల ప్రభావం లోక్‌సభ ఎన్నికల్లో ఉంటుందా? బీఆర్‌ఎస్‌ తిరిగి పుంజుకుంటుందా? రెండు జాతీయపార్టీలను కాదని ప్రజలకు బీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో ఓట్లు వేసి ఎక్కువ సీట్లు కట్టబెడుతారా? వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 

కాంగ్రెస్‌ పార్టీని బలహీనపరచడానికి బీఆర్‌ఎస్‌ అధినేత చేసిన ప్రయత్నాల ఫలితంగా ఆ పార్టీ బలహీనపడలేదు. తద్వారా ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని ఆశించిన బీజేపీ ఆశలు ఫలించలేదు. ప్రజలకు స్పష్టత ఉన్నది. 2018 నుంచి 2023 వరకు కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేలు, నేతలు పార్టీ వీడినా ప్రజలు ఆ పార్టీకే పట్టం కట్టారు. బీజేపీకి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా లేదా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని తీర్పు చెప్పారు.

 

బీజేపీ రాష్ట్రంలో బలం పుంజుకోవడానికి అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు బండి చేసిన రాజకీయ యాత్రలు, ఆయన ప్రసంగాలే కారమణే వాదనలు తప్పు అని సొంత పార్టీనేతలే కాదు,ప్రజలు కూడా అదే చెప్పారు. అందుకే 2019లో ఎంపీలుగా గెలిచి పోటీ చేసిన బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌, సోయం బాపూరావు వంటి నేతలతో పాటు ఈటల రాజేందర్‌, రఘునందన్‌ వంటి నేతలు కూడా ఓడిపోయారు. ఇప్పుడు వాళ్లలలో బాపూరావు మినహా మిగిలిన వాళ్లంతా లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నారు.

 

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కారు పార్టీలో నేతల ఫిరాయింపులు, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు, ఫోన్‌ ట్యాపింగ్‌, గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలలో అవకతవకల వంటి పరిణామాలను ఆపార్టీని కకావికలం చేస్తున్నాయి. దీంతో బీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీగా పోటీ చేయడానికీ నేతలు వెనుకడుగు వేసే పరిస్థితి నెలకొన్నది. రంజిత్‌రెడ్డి, డాక్టర్‌ కడియం కావ్య లాంటి వాళ్లు పార్టీ మారి కాంగ్రెస్‌ టికెట్‌పై బరిలో నిలువడమే దీనికి ఉదాహరణ. ఎమ్మెల్యేలతో పాటు, కీలక నేతలు పార్టీ వీడుతుండటంతో కేసీఆర్‌ ప్రజల్లోకి వచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనా విధానాలు, కరెంటు, రైతు, చేనేత కార్మికుల సమస్యలతో క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు.

 

కేసీఆర్‌ యాక్టివ్‌ కావడం వల్ల బీఆర్‌ఎస్‌కు జరుగుతున్న నష్టాన్ని కొంత నిలువరించగలుగుతాడు. కానీ దీనివల్ల కాంగ్రెస్‌ పార్టీ కంటే ఎక్కువగా బీజేపీకే నష్టం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాలుగు నెలల కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరు ఆధారంగానే బీఆర్‌ఎస్‌ వైపు ప్రజలు మొగ్గుచూపే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ తన పార్టీలో నెలకొన్న రాజకీయ సంక్షోభం, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీ వైపు మళ్లకుండా.. ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలనే ఆ పార్టీ యత్నాలకు కేసీఆర్‌ పర్యటనలు అడ్డుకట్ట వేస్తాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కేసీఆర్‌ పోరాటం చేసినంత కాలం బీజేపీకి కష్టకాలమే.

 

కనుక రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నది ఇప్పుడే అంచనాకు రాలేం. కానీ మెజారిటీ స్థానాల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్‌ బీఆర్ఎస్‌ ల మధ్యే ఉండబోతున్నది. అది కూడా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, బీఆర్‌ఎస్‌ మాజీ అభ్యర్థుల మధ్యే పోటీ ఎక్కువగా ఉండనున్నది. కాంగ్రెస్‌ నేతలు వ్యాఖ్యానిస్తున్నట్టు బీఆర్‌ఎస్‌ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారని, లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్టీ కనుమరుగు అవుతుంది అన్నది అంత తేలిక కాదు.

 

కేసీఆర్ రాజకీయంగా తీసుకున్న నిర్ణయాల కాంగ్రెస్‌ పార్టీని బలహీనపరిచి రాష్ట్రంలో అంతగా బలం లేని బీజేపీకి ఎక్కువ స్కోప్‌ ఇవ్వడం వల్ల 2019 ఒక్క ఎమ్మెల్యే సీటు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ సీట్లు తెచ్చుకోవడానికి కారణమైంది. నాడు కేసీఆర్ చేసిన తప్పులను కాంగ్రెస్‌ పార్టీ పునరావృతం చేయదు. దీనికితోడు కేసీఆర్ చేస్తున్న పోరాటాల వల్ల రెండు రకాలుగా బీజేపీకే ఎక్కువ నష్టం జరుగుతుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో అది కనిపించబోతున్నదని అనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Latest News