నేటీ నుంచి కేసీఆర్ బస్సుయాత్ర

పార్లమెంటు ఎన్నికల ప్రచారం కోసం బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న బస్సుయాత్ర నేడు బుధవారం నుంచి ప్రారంభంకానుంది

  • Publish Date - April 24, 2024 / 06:08 AM IST

17రోజుల పాటు యాత్రకు బస్సు సిద్ధం
మిర్యాలగూడలో ప్రారంభం
మే 10న సిద్దిపేటలో ముగింపు
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో రోడ్ షోలు

విధాత, హైదరాబాద్‌ : పార్లమెంటు ఎన్నికల ప్రచారం కోసం బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న బస్సుయాత్ర నేడు బుధవారం నుంచి ప్రారంభంకానుంది. కేసీఆర్ యాత్ర కొన‌సాగించ‌బోయే బ‌స్సుకు తెలంగాణ భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ పూజా కార్య‌క్ర‌మాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. బుధవారం నుంచి 17 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల కమిషన్‌ అనుమతి లభించింది. మే నెల 10 వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. మిర్యాలగూడలో ప్రారంభమై సిద్దిపేటలో జరిగే బహిరంగసభతో ఈ యాత్ర ముగుస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్‌ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. దాదాపు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు ఉండే విధంగా బస్సు యాత్ర కొనసాగనుంది. మధ్యలో అదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో చేపట్టే బస్సుయాత్రకు మాత్రం ఆయన దూరభారం కారణంగా హెలిక్యాప్టర్‌లో వెలుతారు. మిగతా అన్ని నియోజకవర్గాల్లోని ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రత్యేక బస్సులోనే ప్రయాణిస్తారు. బస్సు యాత్రలో భాగంగా ప్రతి రోజు ఉదయం పొలం బాట కార్యక్రమం ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలోనూ ఉదయం పర్యటనల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమవుతారు. సాయంత్రం వేళల్లో కనీసం 2 ప్రాంతాల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లలో కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రచారం ముగిశాక స్థానిక బీఆరెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఇళ్లలోనే కేసీఆర్ బస చేస్తారు.

Latest News