విధాత,హైదరాబాద్: కేసీఆర్ మహాజాదూ అని, ఆయన నీళ్ల నుంచి కూడా ఓట్లు సృష్టించగలరని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లేని వివాదాన్ని సృష్టిస్తున్నారని, తద్వారా రాజకీయ, ఆర్థిక లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిజంగా కృష్ణా జలాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేయాలని, ఆ దీక్షకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటిస్తుందని రేవంత్ చెప్పారు. ఆదివారమిక్కడ తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవోలపై తాము ఫిర్యాదు చేసినప్పుడు స్పందించని కేసీఆర్ ఇప్పుడు ఏదో చేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. కేసీ ఆర్ అనుమతి తీసుకున్న తర్వాతే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టును ప్రారంభించారన్నారు. ఈనెల 9న జరగాల్సిన కృష్ణా రివర్‌బోర్డు అపెక్స్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరడం సరైంది కాదన్నారు.