ధరావత్ తండాలో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్‌

  • Publish Date - March 31, 2024 / 02:28 PM IST

  • బాధిత రైతు కుటుంబానికి 5లక్షల ఆర్ధిక సహాయం
    దారి వెంట బీఆరెస్ శ్రేణుల హంగామా

విధాత : అన్నదాతకు అండగా నిలిచేందుకు బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పల మండలం ధరావత్‌తండాలో ఎండిన పట పొలాలనలు పరిశీలించారు. సాగునీటి కొరతతో ఎండిపోయిన, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు కేసీఆర్‌ చేపట్టిన పొలంబాట కార్యక్రమంలో భాగంగా ధరావత్ తండాకు చేరుకుని ఎండిన పంటలను పరిశీలించి బాధిత రైతులను పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులను ప్రభుత్వం అదుకునే విధంగా మీకు అండగా పోరాడుతామని భరోసానిచ్చారు.

ఈ సందర్భంగా నాలుగు బోర్లు వేసినా చుక్క నీరు రాక నాలుగు ఎకరాల పంటను కోల్పోయిన మహిళా రైతు ఆంగోతు సత్తెమ్మ కేసీఆర్ ముందు తన గోడువెల్ల బోసుకుంది. బోర్లు వేసి నీళ్లు రాక పంటలు ఎండిపోయి దాదాపు నాలుగైదు లక్షల అప్పు అయిందని కేసీఆర్ ముందు విలపించారు. తన కొడుకు పెళ్లి పెట్టుకున్నానని పంట ఎండిపోవడంతో చేతిలో చిల్లి గవ్వలేక ఎంతో ఇబ్బందులు పడుతున్నానని చెప్పుకోవడంతో తక్షణమే స్పందించిన కేసీఆర్ సత్యమ్మ కుమారుని వివాహ ఖర్చు నిమిత్తం ఐదు లక్షల రూపాయలను అక్కడికక్కడే ప్రకటించారు.

రైతులు ధైర్యంగా ఉండాలని పోరాడి మన నీళ్లను మనం సాధించుకుందామని.. 24 గంటల కరెంటును సాధించుకుందామని.. రైతు రుణమాఫీని, రైతు బంధు పోరాడి సాధించుకుందామని భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి కేసీఆర్‌ సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పర్యటనకు బయలుదేరారు. కేసీఆర్‌ వెంట ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ తదితరులు ఉన్నారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి జనగామకు ప్రత్యేక బస్సులో బయలుదేరిన కేసీఆర్‌కు దారి వెంట భువనగిరి, ఆలేరు, జనగామలలో బీఆరెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఎదురెల్లి స్వాగతం పలికి హంగామా చేశారు. దాదాపు వంద కార్ల కాన్వాయ్‌తో సాగిన కేసీఆర్ బస్సు పొలం బాట పట్టింది.

Latest News