KCR | కేసీఆర్ చ‌దువుతున్న బుక్స్ ఇవే..! సోష‌ల్ మీడియాలో పుస్త‌కాలు వైర‌ల్

  • Publish Date - April 13, 2024 / 11:27 AM IST

KCR | బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్.. ప‌దేండ్లు అధికారం అనుభ‌వించిన సంగ‌తి తెలిసిందే. మూడోసారి కూడా గెలిచి అధికార పీఠం కైవసం చేసుకుంటార‌ని గులాబీ శ్రేణులు భావించారు. కానీ అది జ‌ర‌గ‌లేదు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించింది. బీఆర్ఎస్ కేవ‌లం 39 స్థానాల‌కే ప‌రిమిత‌మై ప్ర‌తిప‌క్ష పార్టీగా అసెంబ్లీలో అడుగు పెట్టింది. ఇది కేసీఆర్‌కు మింగుడు ప‌డటం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్ట‌లేదు. స్పీక‌ర్ చాంబ‌ర్‌లోనే కేసీఆర్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. కాలి నొప్పి కారణంగా ఎర్ర‌వెల్లి వ్య‌వ‌సాయ క్షేత్రానికే ఆయ‌న ప‌రిమిత‌మ‌య్యారు. ఆ నొప్పి నుంచి కోలుకున్న త‌ర్వాత రైతుల‌కు మ‌ద్ద‌తుగా పొలం బాట ప‌ట్టారు. ఒక‌ట్రెండు బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొన్నారు.

ప్ర‌స్తుతం కేసీఆర్ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బిజీ అయిపోయారు. బీఆర్ఎస్ పార్టీని ఎలా గెలిపించాల‌నే దానిపై తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తున్నారు. 17 లోక్‌స‌భ స్థానాల్లో క‌నీసం స‌గం సీట్ల‌లోనైనా బీఆర్ఎస్‌ను గెలిపించుకునేందుకు కేసీఆర్ వ్యూహం ర‌చిస్తున్నారు. అయితే తీరిక దొరికిన‌ప్పుడ‌ల్లా కేసీఆర్ పుస్త‌కాలు చ‌దువుతున్న‌ట్లు తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ టేబుల్ మీద ఉన్న పుస్త‌కాల‌ను చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది. పుస్త‌కాల‌తో పాటు స‌ర్వే రిపోర్టులు కూడా తెప్పించుకుని ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. జాన్ సీ మ్యాక్స్‌వెల్ రాసిన లాస్ ఆఫ్ లీడ‌ర్‌షిప్( Laws of Leadership) అనే పుస్త‌కంతో పాటు జ‌ప‌నీయుల‌కు సంబంధించి ఇకిగాయ్(తెలుగు అనువాదం) అనే పుస్త‌కాలను చ‌దువుతున్న‌ట్లు తెలిసింది. ఎందుకంటే ఈ రెండింటితో పాటు మ‌రిన్ని పుస్త‌కాలు కేసీఆర్ టేబుల్ మీద ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Latest News