KCR | సీఎం రేవంత్ కు కేసీఆర్ బహిరంగ లేఖ..పదేండ్ల తర్వాత క్షమాపణ డిమాండ్

మేమే తెలంగాణ ఇచ్చామని ఆధిపత్య, అహంభావ ధోరణినితో ఉద్యమాన్ని, అమరుల త్యాగాన్ని కాంగ్రెస్ నేతలు అవమానిస్తున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్ అధినేత కేసీఆర్ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఈ వైఖరి గర్హనీయం

  • Publish Date - June 1, 2024 / 08:35 PM IST

కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్
పదేండ్ల తర్వాత క్షమాపణ డిమాండ్
రాజకీయ వేదికపై కేసీఆర్ కొత్త వాదన
రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా లేఖ
త్యాగాల పర్యవసానం తెలంగాణ
సుదీర్ఘ పోరాట ఫలితం ప్రత్యేక రాష్ట్రం
ఆరునెలల పాలనలో రాష్ట్రం అస్థవ్యస్తం
సీఎం రేవంత్ కు కేసీఆర్ బహిరంగ లేఖ

విధాత ప్రత్యేక ప్రతినిధి:

మేమే తెలంగాణ ఇచ్చామని ఆధిపత్య, అహంభావ ధోరణినితో ఉద్యమాన్ని, అమరుల త్యాగాన్ని కాంగ్రెస్ నేతలు అవమానిస్తున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్ అధినేత కేసీఆర్ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఈ వైఖరి గర్హనీయం. ఈ రకమైన వైఖరిని మార్చుకోనప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి చేసే రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు సార్థకత ఏముంటుందంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా చారిత్రక సత్యాల వక్రీకరణ మాని చేసిన తప్పులకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పండంటూ డిమాండ్ చేశారు. రాజకీయ అవసరాల కోసం కాకుండా, మనస్ఫూర్తిగా కాంగ్రెస్‌ తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పినప్పుడే, కొంతైనా పాప పరిహారం చేసుకున్నట్టు అవుతుందంటూ ఉద్భోధించారు. ముఖ్యమంత్రి అయిన మీరు మీ నోటినుండి ఇప్పటివరకూ జై తెలంగాణ అనే నినాదాన్ని పలక లేదంటూ రేవంత్ రెడ్డిని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ప్రాణ సమానమైన జై తెలంగాణ నినాదాన్ని నోటినిండా పలకలేని మీ మానసిక వైకల్యాన్ని ప్రజలు ఆక్షేపిస్తున్నారని, ఇక ముందయినా తెలంగాణ వ్యతిరేక మానసికత నుంచి బయటపడి జై తెలంగాణ అని నినదించే వివేకాన్ని తెలంగాణ సమాజం మీనుంచి కోరుకుంటున్నదని కేసీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలవుతున్నా అమరవీరుల స్థూపం వద్ధ శ్రద్ధాంజలి ఘటించక ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయ పరిచారని విమర్శించారు. కాంగ్రెస్‌ఇప్పటికీ మారలేదు. ఇక మారదు. ఇక ముందు మారే అవకాశం లేదు. నాటికీ, నేటికీ ఎన్నటికీ కాంగ్రెస్‌కు తెలంగాణ ఒక రాజకీయ అవకాశమే తప్ప, మనఃపూర్వక ఆమోదం కాదు. గత ఆరు నెలలుగా సాగుతున్న మీ పరిపాలనే ఇందుకు నిదర్శనమంటూ కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు.

రేవంత్ కు కేసీఆర్ బహిరంగ లేఖ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్ శనివారం బహిరంగలేఖ రాశారు. సుదీర్ఘమైన 22 పేజీల ఈ లేఖలో అనేక అంశాలను కేసీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రానికి ముందూ ఆ తర్వాత బీఆరెస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలో అనేక పరిణామాలు జరిగాయంటూ పేర్కొనడం ఆసక్తికరమైన అంశంగా భావిస్తున్నారు. సెంటిమెంటు, రాజకీయ లక్ష్యం, కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పాలనను టార్గెట్ చేస్తూ కేసీఆర్ రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖ కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వం పై వ్యూహాత్మక రాజకీయ దాడియే కాకుండా తెలంగాణ తమ సొత్తు అనే సెంటిమెంటును పండించేందుకు ప్రయత్నించారనే చర్చ సాగుతోంది. ఆరు గ్యారెంటీలను సాకుగా పెట్టుకుని ఐదేండ్ల కాలానికిచ్చిన హ మీలను సైతం ఆరునెలల్లోనే అమలు చేయలేదంటూ విమర్శించడం పట్ల కేసీఆర్ రాజకీయ లక్ష్యం తేటతెల్లమవుతోందంటూ కాంగ్రెస్ మద్ధతుదారులు విమర్శిస్తున్నారు. పదేండ్లు పాలన చేసి తాము అమలు చేయని హామీల గురించి కనీసం పట్టించుకోకుండా ప్రజా తీర్పును అవమానపరిచే విధంగా ప్రజా సమస్యల పేర కాంగ్రెస్ ను టార్గెట్ చేసి తమ రాజకీయ ప్రయోజనాలు రక్షించుకునే విధంగా కేసీఆర్ లేఖ ఉందంటూ అనుకూల వర్గాలు విమర్శిస్తున్నారు రాష్ట్ర ఆవతరణ దినోత్సవ సందర్భంగా కేసీఆర్ సంధించిన ఈ సుదీర్ఘ లేఖ చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలోని వివరాలిలా ఉన్నాయి. దీనిపై సీఎం రేవంత్ నేడు జరిగే రాష్ట్ర అవతర దినోత్సవం సందర్భంగా ఏ విధంగా స్పందిస్తారనే ఆసక్తిపెరిగింది. రాజకీయ విమర్శలకు అవతరణ దినోత్సవం మరోసారి వేదికగా మారుతోందని భావిస్తున్నారు.

సుదీర్ఘపోరాట ఫలితం తెలంగాణ
ప్రభుత్వం పక్షాన మీరు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రమ్మని మీరు నాకు ఆహ్వానం పంపిన నేపథ్యంలో ప్రజల పక్షాన నేను మీకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నానంటూ కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితమనీ, అమరుల త్యాగాల పర్యవసానమనీ కాకుండా, కాంగ్రెస్‌దయాభిక్షగా ప్రచారం చేస్తున్న మీ భావ దారిద్య్రాన్ని నేను మొట్టమొదట నిరసిస్తున్నాను. 1969 నుండీ ఐదు దశాబ్దాలు, భిన్నదశలలో, భిన్నమార్గాలలో ఉద్యమ ప్రస్థానం సాగింది. చరిత్ర పొడుగునా తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది దాచేస్తే దాగని సత్యం. 1952 ముల్కీ ఉద్యమంలో విద్యార్థులపై కాల్పులు ఫజల్‌అలీ కమీషన్‌సిఫార్సులను కాలరాచి ఆంద్రప్రదేశ్‌ఏర్పాటు వల్ల తెలంగాణను చిన్నాభిన్నం చేసిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని విమర్శించారు. తొలిదశలో 369 మందిని కాల్చిచంపిన కాంగ్రెస్‌ దమననీతికి సాక్ష్యం గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపమన్నారు.

ఉద్యమంలో మలుపు టీఆరెఎస్

తెలంగాణ సాధన లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ఏర్పాటు ఉద్యమంలో మేలిమలుపు. ఉద్యమానికి రాజకీయ వ్యక్తీకరణ నిచ్చి రాజకీయ శక్తిగా మలిచింది. నేను నా ప్రాణాలను పణంగా పెట్టి ‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్‌సచ్చుడో’ అని ఆమరణ నిరాహార దీక్షకు దిగితే డిసెంబర్‌9 ప్రకటన వచ్చిందని పేర్కొన్నారు.

ఆరునెలల్లో తెలంగాణ అస్తవ్యస్థం

కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరునెలల కాలంలో ప్రజా జీవితం అస్తవ్యస్తమై పోయింది. రైతాంగం పరిస్థితి మరీ దిగజారిపోయింది. బి ఆరెఎస్ దార్శనికతతో శాశ్వతంగా దూరమైన కష్టాలు, సమస్యలన్నీ..మీ అసమర్థ పాలనతో ఆర్నెల్లలోనే తిరిగి ప్రత్యక్షమైతున్నయంటూ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రారంభించిన రైతుబంధు, 24 గంటల కరెంటు అందించడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. డిసెంబర్‌9 లోపు అమలు చేస్తామన్న రుణమాఫీ ఇవ్వలేదని విమర్శించారు. మీరిస్తామని ప్రకటించిన రైతు భరోసా ఇవ్వలేదని, నీటిపారుదల రంగంలో పదేళ్ళలో స్వర్ణ యుగాన్ని అనుభవించిన రాష్ట్రాన్ని కృత్రిమ కరువు పాలు చేసారు. నదీ జలాలను ఎత్తిపోసే వ్యవస్థ అందుబాటులో ఉన్నా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. మీరు సోయి దప్పిన తీరుగా కృష్ణా నది పై ఉన్న ప్రాజెక్టులను కె ఆర్ ఎంబీకి అప్పజేప్పేసారు. రాష్ట్ర ప్రయోజనాలను భంగపరిచారని విమర్శించారు. 500 రూపాయల బోనస్‌ఇస్తామన్న మీ హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. మీ పాలనలో బ్లాకులో పత్తి విత్తనాల అమ్మకం జరుగుతున్నది అంటే అవినీతి ఎంతగా పెచ్చుమీరిందో అర్థం అవుతున్నదని విమర్శించారు. మీ పాలనతో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆటో కార్మికుల సమస్యలు పెరిగాయని పేర్కొన్నారు.

అరచేతిలో వైకుంఠం

ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేశారంటూ మండిపడ్డారు.
ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ. 12,000 ఇస్తామని వాగ్దానం చేసి ఇవ్వలేదు. రైతు కూలీలకు కూడా ఏడాదికి 12 000 రూపాయలు ఇస్తామని ఇప్పటివరకూ ఒక్క పైసా ఇవ్వలేదు. ఆడబిడ్డలకు నెలకు రూ. 2500 రూపాయలు ఇస్తామని ఊదరగొట్టారు. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు, విద్యార్థులకు 5 లక్షల విద్య భరోసా కార్డు ఇస్తామన్నారు. అమలులో ఉన్న ఫీజు రీఎంబరస్‌మెంట్‌పథానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వటం లేదు. రూ.20 లక్షల ఓవర్సీస్‌స్కాలర్‌షిప్‌ఏ ఒక్కరికీ ఇవ్వలేదు. 2016 రూపాయల నుంచి 4,000 కు పెంచి “చేయూత’’ పేరుతో అందిస్తామని అమలు చేయలేదు. మెగా డి ఎస్‌సి ప్రకటిస్తామని అన్నారు. మెగా డి ఎస్‌సి ని, దగా డి ఎస్‌సి చేసారు. 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. జాబ్‌క్యాలెండర్‌జాడే లేదు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. మీరు అధికారం పగ్గాలు చేపట్టిన నాటి నుండీ ప్రజావైద్యం దిగజారుతున్నదని విమర్శించారు. రాష్ట్ర చిహ్నాల మార్పు, ఒక్కటేమిటీ అన్నింటా విఫలమయ్యారంటూ పదేండ్లలో తాము చేపట్టిన పథకాల లిస్టును పేర్కొంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలలో విఫలమయ్యారంటూ కేసీఆర్ ఆ లేఖలో కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు.

Latest News