విధాత : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని నరేంద్రమోడీ మాదిగల విశ్వరూప సభలో ఇచ్చిన హామీని తప్పక నెరవేరుస్తారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హైద్రాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా శాంతియుత పోరాటం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకకరణ సమస్యపై ఎన్నో కమిటీలు వేశాయన్నారు. ఏ ప్రధాని కూడా ఎస్సీ వర్గీకరణ పై సీరియస్ గా దృష్టి పెట్టలేదన్నారు.
ఎస్సీ వర్గీకరణ పై అన్ని పార్టీలు అవకాశ వాద, దాటవేత వైఖరీని అనుసరించాయన్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ముద్దాయి అన్నారు. యూపీఏ ప్రభుత్వం తుషార్ మెహతా కమిటీ వేసి వదిలేసిందన్నారు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ కమిటీ నివేదికను కూడా చదవలేదన్నారు. మందకృష్ణ మాదిగ జూలైలో ప్రధాని మోడీని కలిసి ఎస్సీ వర్గీకరణ సమస్యను విన్నవించారన్నారు. ఆగస్టులో ఎమ్మార్పీఎస్ నాయకులను అమిత్ షా ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడారన్నారు.
ఎస్సీ వర్గీకరణ పై గతంలో సుప్రీంకోర్టు రెండు రకాల తీర్పులు ఇచ్చిందన్నారు. ఐదుగురు సభ్యుల ధర్మాసనాలు పరస్పర విరుద్ద తీర్పులిచ్చాయన్నారు. ఒక ధర్మాసనం వర్గీకరణ జరగాలంటే, మరొక ధర్మాసనం వద్దని తీర్పు ఇచ్చిందన్నారు. చివరిగా ఏడుగురు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని సూచించిందని తెలిపారు.
కేంద్రం ఎస్సీ వర్గీకరణలో కమిటీ వేసి నిర్దిష్ట కాలపరిమితిలో ఈ సమస్యకు న్యాయ, చట్టపర పరిష్కార చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తారన్నారు. 370ఆర్టికల్ తొలగింపు, అయోధ్య రామ మందిర నిర్మాణం, త్రిఫుల్ తలాక్, మహిళా రిజర్వేషన్ వంటి కీలక అంశాలే ప్రధాని మోడీ హామీల అమలులో నిజాయితీకి, చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.