- గుజరాత్ పెత్తనం కాదు..ఇటలీ పెత్తనంకు వ్యతిరేకంగా పోరాడాలి
- ఫేక్ వీడియోల స్థాయికి సీఎం దిగజారారు
- కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ధ్వజం
విధాత, హైదరాబాద్ : ఎక్కడా లేని రీతిలో గాడిదలకు గుడ్డు పెట్టించగలిగే సీఎం రేవంత్‌రెడ్డి ఐదు నెలల కాలంలో ప్రజల మధ్య తిరుగాల్సింది పోయి గాడిదల మధ్య తిరుగుతు చెబుతున్న మాటలను జనం నమ్మే పరిస్థితిలో లేరని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో చ్చిన ఆరు గ్యారెంటీలను గాలికి వదిలేసి, నిన్నటివరకు రాజ్యాంగం అని తిరిగి, ఫేక్ వీడియోలు మార్పింగ్ చేయించి, ఇప్పుడు గాడిద గుడ్డు నెత్తికెత్తుకున్నాడని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లలో తెలంగాణకు ఎంత ఇచ్చిందో, బీజేపీ అధికారంలో ఉన్న పదేళ్లలో ఎంత ఇచ్చిందో బహిరంగ చర్చకు రేవంత్ సిద్దమా అని సవాల్ విసిరారు. రిజర్వేషన్లపై ఫేక్ వీడియోలు ప్రచారం చేసిన వారిలో మొదటి ముద్దాయి రేవంత్ రెడ్డినని, ఈ వీడియోలు సృష్టించిన వారిలో ఎవరున్నా వదిలిపెట్టేది లేదని, జైలుకు పంపుతామని హెచ్చరించారు. బీజేపీకి వస్తున్న ఆధరణను ఓర్వలేక పార్టీపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు.
ఫోన్ ట్యాపింగ్, హోం మంత్రి వీడియో మార్పింగ్ రెండు నేరాలేనని.. రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ ప్రచారం చేస్తే.. బీఆరెస్‌కు హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని అన్నారు. వీరి బాగోతాలను ప్రజలు అర్థం చేసుకొని గత ఎన్నికల్లో బీఆరెస్‌ను ఇంటికి పంపారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి పడుతుందని సూచించారు. గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి పోటీ అంటున్న రేవంత్‌రెడ్డి ఏనాడైనా తెలంగాణ ఉద్యమంలోపాల్గొన్నాడా అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవినీతికి, మీ ఇటలీ పెత్తానాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ బీజేపీ పౌరుషం సరిపోతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీది ఇటలీ డీఎన్ఏ అని, ఈఎన్‌సీ అంటెనే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని, మళ్లీ బీజేపీ అంటే బ్రిటీష్ నేషనల్ పార్టీ అని కారుకూతలు కూస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో ఢిల్లీ బాసులకు సూట్ కేసులు పంపుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ మీద కోపంతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు వేసి గెలిపించారన్న సంగతి మరువరాదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తోందని, ప్రజలకు కాంగ్రెస్ రాజ్యాంగం కావాలా? లేక రాజ్యాంగాన్ని అనుసరించి ప్రధాని మోడీ పాలన కావాలా? నిర్ణయించుకోవాలన్నారు.