Site icon vidhaatha

బీజేపీ కనుసన్నల్లో కేంద్ర ఎన్నికల సంఘం: కేటీఆర్

రాజకీయ కోణంలోనే కేసీఆర్ ప్రచారంపై నిషేధం
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

విధాత, హైదరాబాద్‌ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం క‌నుస‌న్న‌ల్లోనే కేంద్ర ఎన్నిక‌ల సంఘం న‌డుస్తోంద‌ని బీఆరెస్‌ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా మాట్లాడుతున్న ప్రధాని మోదీకి, అమిత్ షాకు నోటీసులు జారీ చేయ‌లేదని, కేసీఆర్‌ను దుర్భాషలాడుతున్న సీఎం రేవంత్‌పై చర్యలు తీసుకోలేదని, నేతన్నల సమస్యలపై ఆవేద‌న‌తో మాట్లాడిన కేసీఆర్‌కు మాత్రం నోటీసులు జారీ చేసి, 48 గంట‌ల పాటు ప్ర‌చారంపై నిషేధం విధించార‌ని కేటీఆర్ తప్పుబట్టారు. తెలంగాణ భ‌వ‌న్‌లో గురువారం కేటీఆర్ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
ఇవాళ రాష్ట్రంలో, దేశంలో ఉన్న‌ ప‌రిస్థితులు చూస్తుంటే.. ప్ర‌స్తుత కేంద్ర ప్ర‌భుత్వం, వారు తీసుకున్న నిర్ణ‌యాలు దానికి అనుగుణంగా జ‌రిగిన నియామ‌కాలు, స్వ‌యం ప్ర‌తిప‌త్తి సంస్థ‌ల‌ను త‌మ గుప్పిట్లో పెట్టుకుని ఆటాడిస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుందన్నారు. ఇన్ని రోజులు దర్యాప్తు సంస్థలే అనుకున్నాం కాని ఈసీ కూడా బీజేపీ చెప్పిందే వింటోందని, ఆ పార్టీ క‌నుస‌న్న‌ల్లో న‌డుస్తోందని అర్ధమవుతుందని, ఇందులో ఎలాంటి రెండో ఆలోచ‌న, అభిప్రాయం త‌మ‌కు లేదని స్పష్టం చేశారు. దేశంలో బీజేపీ ప్ర‌ధాని, హోం మంత్రి మ‌త వైష‌మ్యాలు రెచ్చ‌గొట్టేలా మాట్లాడిన‌, విద్వేషాన్ని రెచ్చ‌గొట్టేలా దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేసినా, ప్ర‌త్యర్థి పార్టీల‌ను బీజేపీ నాయ‌కులు బండ‌బూతులు తిడుతున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ అఫిషియ‌ల్ ట్విట్ట‌ర్ ముస్లింల‌పై విషం చిమ్ముతూ.. ప్ర‌చారం చేస్తున్నా ఒక్క చ‌ర్య లేదని, ఎలాంటి నోటీసులు జారీ చేయ‌లేదని కేటీఆర్ పేర్కోన్నారు. కేవలం రాజకీయ కోణంలోనే కేసీఆర్ ప్రచారంపై ఈసీ ద్వారా నిషేధం విధించినట్లుగా భావిస్తున్నామని కేటీఆర్ పేర్కోన్నారు. ఈసీ తీరు రాజ్యాంగాన్ని అపహాసం చేసేదిగా ఉందన్నారు.

మోదీకి మోకరిల్లిన ఈసీ
ఇటీవ‌లే ప్రధాని మోదీ ఈ దేశంలో ముస్లింలే ఎక్కువ పిల్ల‌లు కంటార‌ని, వేరే వారు అధికారంలోకి వ‌స్తే దేశ సంప‌ద‌ను ముస్లింల‌కు దోచి, పంచి పెడుతార‌ని ఇష్టారీతిన వ్యాఖ్య‌లు చేస్తే దాదాపు 25 వేల మంది పౌరులు ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారని కేటీఆర్ పేర్కోన్నారు. క‌నీసం మోదీకి దీనిపై నోటీసు కూడా ఇవ్వ‌లేదన్నారు. మోదీకి భ‌య‌ప‌డ్డ ఎన్నిక‌ల సంఘం ఈ వివాదంపై బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాకు నోటీసులు జారీ చేశారని చేశారని, మోదీ వ్యాఖ్య‌లపై న‌డ్డా జ‌వాబు ఇవ్వాల‌ని త‌లాతోక లేని నిర్ణ‌యం ఎన్నిక‌ల క‌మిష‌న్ తీసుకుందని కేటీఆర్ విమర్శించారు.
ఎన్నిక‌ల్లో దేవుడిని, మ‌తాన్ని ఇన్‌వాల్వ్ చేయ‌డం నేరమని, అమిత్ షా శ్రీరాముడి బొమ్మ ప‌ట్టుకుని ఎన్నిక‌ల‌ ప్ర‌చారం చేశారని, దీనిపై కూడా ఫిర్యాదు చేసినా ఎన్నిక‌ల క‌మిష‌న్ ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని కేటీఆర్‌ నిల‌దీశారు. బీజేపీ అభ్య‌ర్థి, నటుటు అరుణ్ గోవిల్ రాముడి ఫొటోతో ప్ర‌చారం చేసిన చర్యలు లేవన్నారు.

కేసీఆర్ గొంతు నొక్కారు..
కేసీఆర్ విష‌యానికి వ‌స్తే మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం ఆగ‌మేఘాల మీద నోటీసులు జారీ చేసిందని, నోటీసులు అందిన త‌ర్వాత మా లాయ‌ర్లు, నాయ‌కుల స్పందించి లీగ‌ల్ సెల్ ద్వారా జ‌వాబు ఇచ్చారని తెలిపారు. ఈ మ‌ద్య‌కాలంలో ఎండిన పంట‌ల ప‌రిశీల‌న‌కు కేసీఆర్‌ క‌రీంన‌గ‌ర్‌కు వ‌చ్చిన‌ప్పుడు , రైతులు, నేతన్నలు తమ కష్టాలను కేసీఆర్‌కు వివరించారని, వారి ఆవేద‌న‌, బాధ చూసిన త‌ర్వాత సిరిసిల్ల‌లో కేసీఆర్‌ మీడియా స‌మావేశం భావోద్వేగంతో కేసీఆర్ ఒక మాట అన్నారని, ఆ ఒక్క మాటకే కేసీఆర్ గొంతు నొక్కారని, 48 గంట‌ల పాటు ప్ర‌చారంపై నిషేధం విధించారు అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మీద ఇప్పటివరకు మేము ఎలక్షన్ కమిషన్‌కు 8 సార్లు ఫిర్యాదు చేశామని, ఈసీ చర్యలు తీసుకోకపోగా కనీసం నోటీసులు సైతం ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ నిలదీశారు.

ప్రజాస్పందనకు జడిసే నిషేధం
కేసీఆర్ బ‌స్సు యాత్ర‌కు వ‌స్తున్న ప్ర‌జా స్పంద‌న‌ను చూసి బీజేపీ, కాంగ్రెస్‌లు ఓర్వ‌లేక‌పోతున్నాయ‌ని కేటీఆర్ మండిప‌డ్డారు. 8 -12 సీట్లు బీఆరెస్‌కు వ‌స్తున్నాయ‌ని స‌ర్వేలు వ‌స్తున్నాయి. 2014నుంచి బ‌డా భాయ్ మోదీ చేసిన మోసాన్ని, 2023లో చోటా భాయ్ రేవంత్‌రెడ్డి చేసిన మోసాన్ని పూస‌గుచ్చిన‌ట్టు ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తుంటే.. త‌ట్టుకోలేక ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకు ఇద్ద‌రు కూడ‌బ‌లుక్కొని కేసీఆర్‌ను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్ల‌నీయ‌కుండా ఎన్నికల సంఘం ద్వారా నిషేధం పెట్టించారని ఆరోపించారు. బ‌డా భాయ్.. చోటా భాయ్ క‌న్నుస‌న్న‌ల్లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌ని చేయ‌క‌పోతే.. తాము రేవంత్ మీద ఇచ్చిన 8, మిగతా పార్టీ నాయకుల మీద ఇచ్చిన మరో 19ఫిర్యాదులపై స్పందించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన ప‌రుష ప‌దజాలం మీద ఎన్నిక‌ల సంఘానికి 8 ఫిర్యాదులు ఇచ్చామని, కాని చ‌ర్య‌ల్లేవని, కేసీఆర్‌ను ఉరితీస్తాం.. లాగుల తొండ‌లు వ‌దులుతాం.. ముడ్డి మీద డ్రాయ‌ర్ కూడా ఉండ‌దు.. కేసీఆర్ త‌ల న‌ర‌కండి.. కేసీఆర్ త‌ల తెగ్గోయండి అని రేవంత్ రెడ్డి మాట్లాడారని గుర్తు చేశారు. ఈ మాట‌లు ఎన్నిక‌ల సంఘానికి నీతిసూక్తులు, సుభాషితాల్లాగా వినబ‌డుతున్న‌ట్లుందని, ఈ మాటలు ఈసీకి వినిపించ‌వని, అదే కేసీఆర్ నేత‌న్న‌లు, రైతుల ప‌క్షాన‌ మాట్లాడితే గ‌ట్టిగా ఒక్క మాట మాట్లాడితే.. 48 గంట‌ల నిషేధం విధించారు అని కేటీఆర్ అసంతృప్తి వెళ్లగక్కారు.

కేసీఆర్ సైన్యాన్ని అడ్డుకోలేరు..
48 గంట‌ల పాటు కేసీఆర్ ప్ర‌చారాన్ని నిషేధించొచ్చు కాని కేసీఆర్ త‌యారు చేసిన సైన్యాన్ని మీరు అడ్డుకోలేరని కేటీఆర్ తేల్చిచెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలో కరెంట, మంచినీటీ సమస్యలపైన రేవంత్ రెడ్డి అనే ఒక పనికిమాలిన నాయకుడు ఫోర్జరీ చేసి ఫేక్ డాక్యుమెంట్ చేశాడని విమర్శించారు.
రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతా నుండి మే 12, 2023 తేదీన ఓయూలో నీటి కొరత, విద్యుత్ కోతలు ఉన్నందున క్యాంపస్‌కి సెలవు ప్రకటిస్తున్నామని ఒక ఫోర్జరీ చేసిన ఫేక్ డాక్యుమెంట్‌ని పోస్ట్ చేసాడని, కానీ ఓయూ విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో మే 12, 2023 తేదీన వచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్‌లో సమ్మర్ వెకేషన్ మీద యూనివర్సిటీ విద్యార్థులకు హాలిడేస్ ఇస్తున్నామని ఉందని కేటీఆర్ వాట్సాప్ చాట్‌లతో వెల్లడించారు. ఫేక్ డాక్యుమెంట్ పెట్టిన సీఎం రేవంత్ జైలులో ఉండాలా లేక దానిని వేలెత్తి చూపిన క్రిశాంక్‌నా ఆలోచించాలన్నారు. నేను చూపించిన చాట్ కానీ.. నేను చెప్పింది కానీ తప్పని రుజువు చేస్తే చంచల్ గూడ జైలుకు పోవడానికి నేను రెడీ అని, రైట్ అయితే అదే చంచల్ గూడ జైలుకు ముఖ్యమంత్రిని పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Exit mobile version