Site icon vidhaatha

KTR | పరిశ్రమశాఖ భూముల తనఖాకు రేవంత్ సర్కార్ సిద్ధం: కేటీఆర్

పరిశ్రమలకు ఏమిస్తారు.. ఉద్యోగ కల్పన ఎలా చేస్తారని నిలదీత

విధాత, హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకున్నదని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వభూములను ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు తనఖాపెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుందన్నారు. దీనికి మధ్యవర్తిగా ఒక మర్చంట్ బ్యాంకర్‌ను పెట్టి వారికి రు.100 కోట్ల కమీషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది అని మీడియాలో కథనాలు వస్తున్నాయని ట్వీట్‌లో పేర్కోన్నారు.

ఈ మతిలేని చర్య వల్ల తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుపడి, కొత్తగా పెట్టుబడులు, పరిశ్రమలు రాక, ఉద్యోగాలు రాక, మన బిడ్డలకు కొలువులు రాకుండా పోయే ప్రమాదం ఉన్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయని, అలాంటి చోట 400 ఎకరాలు ప్రైవేట్‌ సంస్థలకు తనఖా పెట్టడం అనాలోచిత చర్య అన్నారు. అసలే గత ఏడు నెలలుగా రాష్ట్ర పారిశ్రామికరంగం స్తబ్దుగా ఉందని, కొత్తగా పెట్టుబడులు రావడం లేదని, ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్కచూపులు చూస్తున్నాయని పేర్కోన్నారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కొరకు పరిశ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెడితే.. కంపెనీలకు ఏమిస్తారు? కొత్తగా మన యువతకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయని ప్రశ్నించారు.

Exit mobile version