అల‌రించిన త్రిఖ‌, మిష్క‌ల‌ ఆరంగేట్రం

నాట్యం అనేది ఇటు క‌ళాకారుల్లో.. అటు ప్రేక్ష‌కుల్లోనూ తాదాత్మ్య‌త క‌లిగించే ఏకైక క‌ళ‌. ఏ క‌ళా రూపం అయినా స‌రే ఎన్నేళ్ల త‌రువాతైనా చూసుకోవ‌చ్చు.

  • Publish Date - June 10, 2024 / 03:08 PM IST

నాట్యం అనేది ఇటు క‌ళాకారుల్లో.. అటు ప్రేక్ష‌కుల్లోనూ తాదాత్మ్య‌త క‌లిగించే ఏకైక క‌ళ‌. ఏ క‌ళా రూపం అయినా స‌రే ఎన్నేళ్ల త‌రువాతైనా చూసుకోవ‌చ్చు. కానీ నాట్యం మాత్రం ప్ర‌ద‌ర్శించేట‌ప్పుడు మాత్ర‌మే ఆస్వాదించగ‌లం… అన్నారు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ బుర్రా వెంక‌టేశం. ఆదివారం సాయంత్రం శిల్ప‌క‌ళావేదిక‌లో సోద‌రీద్వ‌యం త్రిఖ‌, మిష్క‌ల కూచిపూడి రంగ‌ప్ర‌వేశ కార్య‌క్రమానికి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఇప్ప‌టివ‌ర‌కూ సంగీత క‌ళాకారులు జంట ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డం చూశాం. అదేవిధంగా ఈ సోద‌రిలిద్ద‌రూ జంట‌గా ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డం చూడ‌ముచ్చ‌ట‌గా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా అన్నారాయ‌న‌.

ఈ కార్య‌క్ర‌మానికి అతిథిగా హాజ‌రైన సినిన‌టులు సుమ‌న్, పిల్ల‌ల్లో సంస్కారం పెంపొందించాలంటే మ‌న సంస్కృతి లో భాగ‌మైన క‌ళ‌ల వైపు వాళ్ల‌ను ప్రోత్స‌హించాల‌న్నారు. ఇరువురు చిన్నారులు నాట్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటే దేవ‌లోక నృత్యం తిల‌కిస్తున్న భావ‌న క‌లిగింద‌న్నారు. ఆరోగ్యం, ఫిట్ నెస్ పెంచుకోవ‌డానికి వ్యాయామ‌మే చేయ‌న‌క్క‌ర‌లేదు. నాట్యం చేస్తే చాల‌న్నారు.

త్రిఖ, మిష్క ప్రదర్శన లవకుశులను తలపించారన్నారు భార‌తీయం స‌త్య‌వాణి. ఇలాంటి చిన్నారులే భ‌విష్య‌త్తులో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, కళలను నిలబెట్ట‌గ‌ల‌ర‌న్నారు. ఆనందానికి హెచ్చ‌వేత‌లు, బాధ‌ల‌కు భాగ‌వేత‌లుగా… క‌ళ‌లు మ‌న‌ల్ని మోక్ష స్థితికి తీసుకెళ్తాయి. అంత‌టి ఆనందాన్ని అందించిన త్రిఖ‌, మిష్క‌లు, వారి గురువులైన జ్యోతి రెడ్డిని ఈ సంద‌ర్భంగా అభినందించారామె.

చిన్నారులు త్రిఖ‌, మిష్క‌లు జ్యోతి క‌ళాక్షేత్రానికి చెందిన శ్రీమతి జ్యోతి రెడ్డి ద‌గ్గ‌ర గ‌త అయిదారేళ్లుగా కూచిపూడి నేర్చుకుంటున్నారు. త‌మ గురువు జ్యోతిరెడ్డి నృత్య దర్శకత్వం వ‌హించిన ద‌శావ‌తార ఘ‌ట్ట ప్ర‌ద‌ర్శ‌న ఈ కార్య‌క్ర‌మానికే హైలైట్ గా నిలిచింది. ఆన్ లైన్ త‌ర‌గ‌తిలో చేరిన‌ప్పుడు ఆట‌పాట‌ల‌తో హాజ‌రైన త్రిఖ‌, మిష్క‌లు… ఇప్పుడింత అంకిత‌భావంతో, అంద‌మైన‌, ఆహ్లాద‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చినందుకు గురువుగా తానెంతో గ‌ర్వ‌ప‌డుతున్న‌ట్టు చెప్పారు జ్యోతిరెడ్డి.

చిన్నారుల ఆరంగేట్ర కార్య‌క్ర‌మ సంద‌ర్భంగా… కార్య‌క్ర‌మానికి అధ్య‌క్ష‌త వ‌హించిన కె.వి. రామాచారి, గౌర‌వ అతిథి జి.వి. అన్నారావు పాల్గొన్నారు. త్రిఖ‌, మిష్క‌ల టాలెంట్ ని గుర్తించి ప్రోత్స‌హించిన‌ త‌ల్లిదండ్రులు డాక్ట‌ర్ వికాస్ గౌడ్‌, డాక్ట‌ర్ కీర్తి, తాత‌గారైన డాక్ట‌ర్ ఎం.ఎస్‌. గౌడ్ ల‌ను ప్ర‌ముఖ అతిథులంద‌రూ అభినందించారు.

Latest News