Site icon vidhaatha

తెలంగాణ ప్రజలకు మెగా బ్రదర్స్ గ్రీటింగ్స్‌

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల సందర్భంగా మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌లు ట్విటర్ వేదికగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పవర్ స్టార్‌, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ట్వీట్‌లో సకల జనుల కల సాకారమై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అప్పుడే దశాబ్ద కాలం పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ గాలిలో, నేలలో, నీటిలో, మాటలో, చివరకు పాటలో సైతం పోరాట పటిమ తొణికిసలాడుతుందని తెలిపారు. ఈ పోరాటమే నాలో స్ఫూర్తి ని నింపిందని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదంతో సకల జనులు సాగించిన ఉద్యమాన్ని పాలకులు సదా గుర్తెరుగాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ తెలంగాణ ఫలాలు సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా అందాలని సూచించారు. అభివృద్ధిలో తెలంగాణా రాష్ట్రాన్ని అగ్ర పథంలో పాలకులు నిలపాలని కోరారు. ప్రజా తెలంగాణను సంపూర్ణంగా ఆవిష్కరింప చేయాలన్నారు. అప్పుడే ఈ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణాలను బలిదానం చేసిన అమరులకు నిజమైన నివాళి అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి సైతం ట్విటర్ వేదికగా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపాడు. తెలంగాణ స్వప్నం నిజమై నేటికి పది సంవత్సరాలని, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలని ట్వీట్ చేశారు

Exit mobile version