Site icon vidhaatha

KCR మినహా నాకెవరూ సాటి లేరు.. మంత్రి ఎర్రబెల్లి రాజకీయ పాఠాలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తాను చదువుకున్న బడిలోనే రాజకీయ పాఠాలు చెప్పారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao). తన సహవిద్యార్థులు, అధ్యాపకుల మధ్య రాజకీయాలలో రాణించాలంటే పట్టుదల ఒక్కటే కాదు, ప్రజల పట్ల మమకారం కూడా ఉండాలని, గెలుపు పట్ల ఎన్నటికీ సన్నగిల్లని ఆశ ఉంటేనే అది మన దరి చేరుతుందన్నారు.

తన రాజకీయ జీవితంలో అనేక మెట్లు ఎక్కానని తనకు చదువు అబ్బకపోయినా ఆటల్లో మేటిగా నిలిచినానని వివరించారు. ఆ గెలుపు తత్వం రాజకీయాల్లో నాకు నిచ్చెన మెట్లుగా ఉపయోగపడిందంటూ తన రాజకీయ జీవిత సారాన్ని రంగరించి చెప్పే ప్రయత్నం చేశారు. ఇక రాజకీయ రంగంలో గెలుపోటములకు సంబంధించి రాష్ట్రంలో కెసిఆర్(KCR) తప్ప తనకి ఎవరూ సాటిరారంటూ మంత్రి ఎర్రబెల్లి చెప్పడం గమనార్హం.

వరంగల్ జిల్లాలోని మంత్రి స్వగ్రామం పర్వతగిరి మండల కేంద్రంలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి(Alumni Association) ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా తన బాల్య స్మృతులు, పాఠశాలతో ఉన్న అనుబంధం, విద్య పట్ల తను చూపిన అశ్రద్ధ, ఆటల పట్ల కనబరిచిన మక్కువ, తన తండ్రి రాజకీయ జీవితాలను మంత్రి వివరించారు.

చదువు అబ్బకున్నా… ఆటల్లో మేటి

మా నాయన నన్ను గొప్ప డాక్టర్ చేయాలనుకున్నాడు. బాగా చదివించాలని పట్టుపట్టాడు. కానీ, నాకు పెద్దగా చదువు అబ్బలేదు. ఆటలు పట్టుదలతో ఆడేవాడిని అన్ని ఆటల్లో గెలిచేవాడిని. ఆ టైంలో మా నాయన జగన్నాధ రావు సమితి ప్రెసిడెంట్‌గా పోటీ చేశారు. టాస్ వేసి మా నాయనను కాంగ్రెస్ వారు ఓడించారు. ఆ పార్టీని ఓడించాలన్న కసితో టిడిపిలో చేరానని మంత్రి చెప్పారు.

కెసిఆర్ మినహా ఎవరు సాటిరారు

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తర్వాత ఏ ఎన్నికల్లో ఓడిపోకుండా అన్ని ఎన్నికలు గెలుస్తున్నా. ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచా. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం, మంచితనంతో పనిచేస్తే ఓటమి లేనేలేదు. అందుకే నిరంతరం గెలవాలంటే పట్టుదల కావాలి. గెలవాలని కసి ఉండాలి. గెలుపు కోసం పరితపించాలి. గెలిచే వరకు విశ్రమించవద్దు. అప్పుడు గెలుపు ఎప్పుడూ మనతోనే ఉంటుందన్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉన్నత విద్యాసంస్థలను నెలకొల్పుతామని మంత్రి ఎర్రబెల్లి మాట ఇచ్చారు.

Exit mobile version