– కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే గుడ్డి దీపమే
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో మున్నూరు కాపు కులాన్ని రాజకీయంగా గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మెదక్ పట్టణంలోని వెంకటేశ్వర ఫంక్షన్ ప్యాలెస్ లో ఆదివారం మున్నూరు కాపు కృతజ్ఞత సభ నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య తో కలసి మంత్రి హాజరై మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
జిల్లా మున్నూరు కాపు సంఘ భవనానికి ఎకరం స్థలంతో పాటు రూ.కోటి నిధులు కేటాయించినట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో మున్నూరు కాపులను ఏపార్టీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డులోని కోకాపేటలో 5 ఎకరాల స్థలంతో పాటు రూ.5 కోట్ల నిధులు కేటాయించి మున్నూరు కాపుల ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ నిలబెట్టారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే తెలంగాణ అంధకారం అవుతుందని అన్నారు. తెలంగాణ రాకముందు తాగునీటికి తీవ్రగోస ఉండేదని, పెట్టుబడికి నిధులు లేక భూములన్నీ బిల్లుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కృషితో కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల కరెంటు, పెట్టు బడిసాయంతో భూమికి బరువయ్యేంత పంటలు పండుతున్నాయని అన్నారు.
బీఆర్ఎస్ వెంటే మున్నూరు కాపులు : ఎంపీ వద్దు రవిచంద్ర
రాష్ట్రంలో మున్నూరు కాపులంతా బీఆరెస్ వెంటే ఉన్నారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ప్రభుత్వంలో 9 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీ, 2 రాజ్యసభ సభ్యులతో పాటు, 2 సార్లు ఆర్టీసీ చైర్మన్ పదవి, జీహెచ్ఎంసీ మేయర్ పదవిని 2సార్లు మున్నూరు కాపు కులానికి కట్టబెట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన నిర్మాణలకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. మెదక్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, మున్నూరు కాపు కులస్తులు మాట ఇస్తే తప్పరని, రానున్న ఎన్నికల్లో బీఆరెస్ కు మద్దతుగా నిలవాలని కోరారు. మెదక్ పట్టణంలో మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనానికి ఎకరం భూమి, రూ.కోటి నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో మున్నూరు కాపుల సహకారం మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, ఉపాధ్యక్షులు బట్టి జగపతి, కల్లూరి హన్మంత్ రావు, దేమే యాదగిరి, జిల్లా అధ్యక్షులు బట్టి ఉదయ్, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇంచార్జి తిరుపతి రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ శివ దయాళ్, ఎంపీపీలు సబితా, సిద్ధి రామ్, కౌన్సిలర్లు నిర్మల, చందన పాల్గొన్నారు.