కేంద్ర మంత్రిగా ఏం చేశావో చెప్పాలని డిమాండ్
కిషన్‌రెడ్డిపై మంత్రి పొన్నం విమర్శలు
కేటీఆర్ విమర్శలు దెయ్యాలు వేదాలు వల్లించడమే
విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వమే హైదరాబాద్ అంత నిర్లక్ష్యం చేసినట్టుగా అభివృద్ధి కుంటూ పడినట్టుగా కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడటం మానుకోవాలని, రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం రాజకీయ ఆటలతో కూడిన విమర్శలు పక్కన పెట్టి నగర అభివృద్ధికి సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. గురువారం గాంధీభవన్‌లో పొన్నం మీడియాతో మాట్డాడుతూ పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర టూరిజం మంత్రిగా గత 5 సంవత్సరాల్లో కేంద్రం నుంచి హెరిటేజ్ ,టూరిజం ,ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ల నుంచి కేంద్ర మంత్రిగా ఒక్క రూపాయి తేలేదన్నారు. కేంద్రం నుంచి హైదరాబాద్ స్మార్ట్ సిటీ కోసం అమృత్ పథకం నుండి ఒక్క రూపాయి తేలేదని ఆరోపించారు. 10 సంవత్సరాల బీజేపీ కాలంలో హైదరాబాద్ అభివృద్ధికి, జీహెచ్ఎంసీ అభివృద్ధికి బీజేపీ చేసింది ఏమైనా ఉందా కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. రూపాయి కూడా సహకారం చేయకుండా గత ప్రభుత్వంతో అంటకాగి హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేసింది మీరు కాదా అని పొన్నం మండిపడ్డారు. స్థానిక సంస్థలకు 73,74 రాజ్యాంగం ద్వారా వచ్చే 15 వ ఫైనాన్స్ నిధులు తప్ప అదనంగా ఒక్క రూపాయి అయినా తెచ్చారా అని కిషన్‌రెడ్డిని నిలదీశారు.
హైదరాబాద్ హెరిటేజ్ నగరమని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి కలిసి ముందుకెలుదామన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధులు కావాలని అనేక సార్లు విజ్ఞప్తి చేశామని, మా మంత్రి వర్గంతో కూర్చుని..రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేకసార్లు ప్రణాళిక వేసుకుందాం రావాలని కోరామన్నారు. హైదరాబాద్ లో ఉన్న 151 ప్రాంతాల్లో వర్షం వచ్చినప్పుడు నీటి నిల్వలతో ఇబ్బందులు వస్తున్నాయని, అక్కడే ప్రభుత్వ స్థలాల్లో అండర్ గ్రౌండ్ లోకి వాటర్ వెళ్ళే విధంగా ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ లో శానిటేషన్ లాంటి కార్యక్రమాలు పెరుగుతున్నాయని, హైదరాబాద్ ఇమేజ్ భంగం కలిగే విధంగా కిషన్ రెడ్డి మాటలు ఖండిస్తున్నామని, హైదరాబాద్ అభివృద్ధికి చేతనైతే సహాయం చేయండని, రాజకీయాలకు అతీతంగా ఇంచార్జి మంత్రిగా ఇక్కడి సమస్యలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. గాంధీ,ఉస్మానియా ,నిమ్స్ లాంటి హాస్పిటల్ లు మరింత సేవ చేసే విధంగా మరింత అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలని పొన్నం డిమాండ్ చేశారు. పదేళ్లలో మీరు హైదరాబాద్‌లో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు తెచ్చారా అని, అలాంటి మీరు హైదరాబాద్ నిర్లక్ష్యానికి గురైంది అనడానికి హక్కు ఎలా ఉంటుందని విమర్శించారు.
కేటీఆర్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించడమే
హైదరాబాద్ సమస్యలపై కేటీఆర్ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని, బీజేపీ పై ఒత్తిడి తెచ్చి గతంలో ప్రత్యేక నిధులు తేలేకపోయాడని, ఇప్పుడు హైదారాబాద్ గురించి మాట్లాడుతున్నాడని పొన్నం ఏద్దేవా చేశారు. భూకబ్జాలు , అక్రమ కట్టడాలతో హైదారాబాద్ ఇలా కావడానికి కారణం కేటీఆర్ కారణమని ఆరోపించారు. హైదరాబాద్‌కు బీజేపీ ఏం చేసింది , బీఆరెస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం జరిగితే ఉద్యోగ నియామకాలు ఏమైందంటారని, నిరుద్యోగుల ఆందోళనల వెనకాల ఉండి ఎవరు నడిపిస్తున్నారో గ్రహించాలని, నియామక ప్రక్రియ ప్రారంభమైన తరువాత అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది బీఆరెస్ వాళ్లేనని ఆరోపించారు. ప్రతిపక్షాల ఉచ్చులో పడవద్దని తాను విద్యార్థి, నిరుద్యోగులను కోరుతున్నానన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు తమ సమస్యలలో న్యాయముంటే మా దృష్టికి తీసుకురండని సూచించారు. 10 సంవత్సరాల్లో డీఎస్సీ పోస్టులు వేయనోళ్ళు ,టెట్ వేయనోళ్లు ఎందుకు రెచ్చగొడుతున్నారని ప్రశ్నించారు. బీఆరెస్‌కి మహిళలకు ఉచితంగా బస్ ఇవ్వడం ఇష్టం లేదా అంటే నోరు మూసుకున్నారని, ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యడం ఇష్టం లేదా అని ప్రశ్నిస్తున్నామన్నారు.