విధాత, హైదరాబాద్ : గిరిజన సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి సహకారం అందించనుందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని ఆదివాసి భవన్ లో తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు మంత్రి సీతక్క, పలువురు గిరిజనే నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజనులు తమ సాంప్రదాయ కళారూపాలను ప్రదర్వించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గత యూపీయే హయంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో అటవీ హక్కుల చట్టం ద్వారా ఆదివాసీలకు భూమి మీద హక్కు కల్పించారని. ఆ చట్టం వచ్చాక గిరిజనులుకు భూమిపై హక్కు వచ్చిందన్నారు. కానీ 2023 లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జీవో చట్టం ప్రకారం గ్రామాల్లో మైనింగ్ చేసేందుకు గ్రామ పంచాయతీల అనుమతి లేకుండా నేరుగా ఢిల్లీలో అనుమతులు ఉంటే చాలు అనే నిబంధన తీసుకువచ్చారని విమర్శించారు. ఈ చట్టం ఆసరాతో అటవీ ప్రాంతాల్లో మైనింగ్‌కు అనుమతిస్తుండటంతో ఆదివాసీ, గిరిజనుల మనుగడకు ప్రమాదం మొదలైందన్నారు. అడవుల్లో మైనింగ్‌కు అనుమతిస్తున్న ప్రభుత్వాలు అదే అటవీ ప్రాంతంలో రోడ్లు వేసేందుకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. అడవుల్ని గిరిజన ప్రజలే నాశనం చేస్తున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. నిజానికి అడవులు సురక్షింతంగా ఉన్నాయంటే అందులో ఆదివాసి బిడ్డలదే కీలక పాత్ర అన్నారు. సహజవనరులను కొల్లగొడుతున్నకార్పోరేట్ సంస్థలతోనే అడవులకు ముప్పుందన్నారు. గడిచిన 10 ఏండ్లలో గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు రాలేదన్నారు. గిరిజనులున హక్కుల్ని పోరాడి సాధించుకోవాలన్నారు. జీవో నంబర్ 3 తీసేయడంతో ఉద్యోగాలు లేవన్నారు. చెంచు జాతి అంతరించిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎస్సీ, ఎస్టీ డెవలప్ మెంట్ ఫండ్ అని తీసుకువచ్చి రూ.73 వేల కోట్లు కేటాయించగా, ఈ పదేళ్లలో రూ.28 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ప్రకటనలు బారెడుగా, ఖర్చు చారెడు ఉందని విమర్శించారు. గిరిజనులకు స్థిరమైన వ్యవసాయం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, నీటి వనరులు కల్పిచాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనుల ఆర్ధిక స్థితిగతుల అభివృద్ధికి పాలనాయంత్రంగం చర్యలు తీసుకోవాలన్నారు.