Site icon vidhaatha

Minister Sridhar Babu | మా హామీలకు కట్టుబడి ఉన్నాం.. త్వరలో జాబ్ క్యాలెండర్‌

గ్రూప్ 1 పరీక్షను మళ్లీ మేమే నిర్వహించాం
ఎన్నికల కోడ్‌తోనే సగం రోజులు గడిచాయి
హరీశ్‌, కేటీఆర్‌లపై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్‌
ఏపీ ఆలోచలను కాదు..తెలంగాణ ప్రజల ఆలోచనలను అమలు చేస్తామని కౌంటర్‌

విధాత, హైదరాబాద్ : ఎన్నికల హామీల అమలు ఏమైందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆరెస్ మాజీ మంత్రులు టి.హరీశ్‌రావు, కేటీఆర్‌లు చేసిన విమర్శలపై మంత్రి డి. శ్రీధర్‌బాబు మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వారి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని, మీ హాయంలో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నంలో ఉన్నాయని ఒక్కో హామీని అమలు చేస్తామని మంత్రి డి.శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఎన్నికల హామీల అమలుపై ఏపీ సీఎం చంద్రబాబును ఉదాహరణగా తీసుకున్నారంటేనే హరీష్ రావు పరిస్థితి అర్థమవుతుందని చురకలేశారు.

తెలంగాణ ప్రజల ఆలోచనలను మేం అమలు చేస్తామని, ఏపీ ఆలోచనలు కాదని ఘాటుగా కౌంటర్ వేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే గ్రూప్ 1 పరీక్ష నిర్వహించామని, మళ్లీ 12 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్ష మేమే నిర్వహించామన్నారు. త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు. మూడు నెలలు పరిపాలన చేయగానే.. ఎలక్షన్ కోడ్ వచ్చిందని, ఇప్పుడే కోడ్ ముగిసిందని, మా ప్రభుత్వ పాలనలో సగం రోజులు ఎన్నికల కోడ్ కిందనే పోయాయన్నారు. ఇక పాలనపై దృష్టి పెట్టి ఓక్కో హామీలు అమలు చేసుకుంటూ ముందుకెలుతామన్నారు.

ఆశ వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీష్ కు లేదని, వాళ్ల హయాంలో గుర్రాలతో ఆశ వర్కర్స్ ను తొక్కించిన సంగతి మరువరాదన్నారు. పెద్దపల్లిలో బాలికపై జరిగిన హత్యాచార ఘటన దురదృష్టకరమని, నిందితుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయడం జరుగుతుందన్నారు. శాంతి భద్రత విషయంలో మా ప్రభుత్వం సీరియస్ గా ఉందని, మెదక్ అల్లర్ల వెనుక ఎవరి హస్తం ఉన్న ఉక్కు పాదంతో అణిచివేస్తామని, మత ఘర్షణలో విషయంలో సీరియస్‌గా ఉన్నామని, శాంతిభద్రతలపై కేటీఆర్‌కు ఆందోళన అవసరం లేదన్నారు.

Exit mobile version