అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డితో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి,కొండా సురేఖ బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ గురువారానికి వాయిదా పడిన తర్వాత మంత్రులు,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే శంకర్ తదితరులు ఏజీ ఛాంబర్లో ఆయనతో భేటీ అయ్యారు. రేపు హైకోర్టులో వాదనలపై చర్చించారు. బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేసిన వారి తరపు న్యాయవాదులతో పాటు ప్రభుత్వం కూడా ఇంకా వాదనలు వినిపించనుంది. ప్రభుత్వం తరపున వినిపించే వాదనల్లో ఏ ఏ అంశాలు ఉండాలనే దానిపై మంత్రులు అడ్వకేట్ జనరల్ తో చర్చించారు. హైకోర్టులో వాదనల సారాంశం వాదనలు జరిగిన తీరును మంత్రుల బృందం సీఎం రేవంత్ రెడ్డికి వివరించనున్నారు.
మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సుదీర్ఘంగా చర్చించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులతో సీఎం చర్చించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాలని సుప్రీంకోర్టులో సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్విని సీఎం కోరారు. సీఎం రిక్వెస్ట్ మేరకు అభిషేక్ మన సింఘ్వి వర్చువల్ గా హైకోర్టులో తన వాదనలను వినిపించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ బి. మాధవరెడ్డితో పాటు మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ సచేపట్టింది తెలంగాణ హైకోర్టు. మరో వైపు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు మద్దతుగా పలువురు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ఇంప్లీడ్ పిటిషన్లపై గురువారం నాడు విచారణ జరగనుంది.