Site icon vidhaatha

Dasyaam Vinay Bhaskar | కాంగ్రెస్ అధికారంలో చేసింది శూన్యం .. బీఆరెస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్

విధాత, వరంగల్ ప్రతినిధి:కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి చేసింది శూన్యమనీ…మార్పు తెస్తామని చెప్పిన కాంగ్రెస్ తెచ్చింది మార్పు కాదు… బంద్‌ల‌ ప‌ర్వం కొన‌సాగిస్తున్నదనీ … రైతుబంధు బందైంది.. రైతు బీమా బందైంది… ద‌ళిత‌, బీసీ, మైనార్టీ బంధులు బందైనాయి… 24 గంట‌ల క‌రెంటు, కేసీఆర్ కిట్‌, సాగు నీరు బందైంది…చేత‌ల ప్ర‌భుత్వం అనుకుంటే కాంగ్రెస్ కోత‌ల ప‌ర్వం కొన‌సాగుతోందని మాజీ చీఫ్ విప్, బీఆరెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు.

హనుమకొండలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 200 యూనిట్ల ఉచిత క‌రెంటు ల‌బ్ధిదారుల్లో కోత‌లు, 500 గ్యాస్ స‌బ్సిడీ ల‌బ్ధిదారుల్లో కోత‌లు, రుణ‌మాఫీ అమ‌లులో రైతు ల‌బ్ధిదారుల్లో కోత‌లు,
రాబోవు రోజుల్లో రైతుబంధు ల‌బ్ధిదారుల్లోనూ కోతలు విధించేలా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ‌తంలో వ్య‌వ‌సాయం దండుగ కాగా, కేసీఆర్ హ‌యాంలో పండుగైందన్నారు. 11 విడుత‌ల్లో రైతుబంధు ద్వారా 72 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో వేసినట్లు, 32 వేల కోట్ల రైతు రుణాల‌ను మాఫీ చేసినట్లు చెప్పారు.
కాంగ్రెస్ హ‌యాంలో రూ. ల‌క్ష వ‌ర‌కు రుణ‌మాఫీ చేశామ‌ని అన్నారు. అందుకు 6,098 కోట్ల రూపాయ‌లు కేటాయించామ‌ని అన్నారు. గ‌తంలో కేసీఆర్ ప్ర‌భుత్వం ల‌క్ష రూపాయ‌ల రుణ‌మాఫీ కోసం 17 వేల కోట్ల‌ను ఖ‌ర్చు చేసిందని చెప్పారు. మ‌రి 6 వేల కోట్ల‌తోనే ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు రైతు రుణాన్ని మాఫీ చేశామ‌ని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు, అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఎంత‌ మందికి రుణ‌మాఫీ వ‌ర్తించ‌లేదో వారి వివ‌రాలు సైతం తెల‌పాల్సిన బాధ్య‌త ఉందన్నారు. రైతుల‌ను ఏమార్చే ప్ర‌య‌త్నం కాంగ్రెస్ చేస్తోందని విమర్శించారు.

– వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్‌ మొత్తం అమలు చేయాలి

కాంగ్రెస్ పార్టీ వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్‌ లో ప్రకటించిన మొత్తం హామీలన్నింటిని అమలు చేయాలని వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. రైతు రుణ‌మాఫీ ఒక్క‌టి మాత్ర‌మే అమ‌లు చేశారన్నారు. రైతు భ‌రోసా ఎక‌రానికి రూ.15 వేలు, కూలీల‌కు 12 వేలు, ప‌సుపు బోర్డు ఏర్పాటు, రైతు కూలీల‌కు బీమా, వ్య‌వ‌సాయానికి ఉపాధి హామీ, ధ‌ర‌ణి ర‌ద్దు, రైతు క‌మీష‌న్ ఏర్పాటు, పోడు ప‌ట్టాలు వీటి సంగ‌తి ఏంటని నిలదీశారు. మంత్రివ‌ర్గంలో ఉన్న బీసీల‌కు ప్రాధాన్య‌త లేక‌పోవ‌డం… ఆయా మంత్రులు సైతం బీసీల ప‌క్షాన మాట్లాడ‌క‌పోవ‌డం బాధాకరమన్నారు. బీఆరెస్ జిల్లా ఆఫీసు విషయంలో మున్సిప‌ల్ అధికారులు ఇచ్చిన నోటీసుల‌ను వెంట‌నే వెన‌క్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో నాయకులు మ‌ర్రి యాద‌వ రెడ్డి, పులి ర‌జినీకాంత్‌, బొంగు అశోక్ యాద‌వ్‌, చెన్నం మధు, సంకు న‌ర్సింగ్, జోరిక ర‌మేష్‌, స‌దాంత్‌, రామ్మూర్తి, కోటేశ్వ‌ర్‌రావు, ఇమ్మ‌డి రాజు విజ‌య్ ప్ర‌కాశ్ రెడ్డి, బుద్దె వెంక‌న్న‌, మాల‌కుమ్మ‌రి ప‌రుశురాములు, గొల్ల‌పెల్లి వీర‌స్వామి, గండ్ర‌కోట రాకేష్ యాద‌వ్‌, రాజ్‌గోపాల్‌, ప్ర‌ణ‌య్‌, స్నేహిత్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Exit mobile version