ఎన్నిక‌ల‌ మ్యాచ్ ఫిక్స్ అయిందా?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలిచినా ఫ‌ర్వాలేదు కానీ కాంగ్రెస్ మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లో గెల‌వ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో బీజేపీ, బీఆరెస్ పార్టీలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయా? అన్న సందేహాలు రాజ‌కీయ ప‌రిశీల‌కుల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి

  • Publish Date - April 24, 2024 / 07:00 AM IST

– బీఆరెస్ ఓట్లు బీజేపీకేనా?
– ఎవ‌రు గెలిచినా ఫ‌ర్వాలేదు..
కాంగ్రెస్ మాత్రం గెల‌వొద్దు!
– కాషాయ‌, గులాబీ పార్టీల వ్యూహం!
– ప‌లు సీట్ల‌లో బ‌ల‌హీన అభ్య‌ర్థులు
– ఇత‌ర రాష్ట్రాల్లోనూ ఇదే తీరుతో
భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత‌లు
– రాజ‌కీయ ప‌రిశీల‌కుల అంచ‌నా
– కాంగ్రెస్ నుంచీ అవే ఆరోప‌ణ‌లు
– గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ
కాంగ్రెస్ టార్గెట్‌గా రెండు పార్టీలు
– ఇప్పుడు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ..!

విధాత‌: పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలిచినా ఫ‌ర్వాలేదు కానీ కాంగ్రెస్ మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లో గెల‌వ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో బీజేపీ, బీఆరెస్ పార్టీలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయా? అన్న సందేహాలు రాజ‌కీయ ప‌రిశీల‌కుల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బీఆరెస్‌, బీజేపీ నేత‌ల ప్ర‌చార స‌ర‌ళి ప‌రిశీలిస్తే ఇదే అర్థ‌మ‌వుతున్న‌ద‌ని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ, బీఆరెస్ నేత‌ల‌పై ఇదే ర‌క‌మైన విమ‌ర్శ‌లు చేస్తోంది. దేశంలో మూడ‌వసారి అధికారంలోకి రావ‌డం కోసం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్న బీజేపీ ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా కాంగ్రెస్ వ్య‌తిరేకులంద‌రితో జ‌త క‌డుతోంది. దేశంలో కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా ఉన్న కొన్ని పార్టీల‌తో ప్ర‌త్య‌క్షంగా పొత్తు పెట్టుకున్న బీజేపీ, మ‌రికొన్ని పార్టీల‌తో ప‌రోక్షంగా స్పేహ‌సంబంధాలు నెరుపుతున్న‌ద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు గుర్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ ప‌రోక్షంగా బీఆరెస్‌తో స్నేహ సంబంధాలు కొన‌సాగిస్తుంద‌న్న సందేహాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. 10 ఏళ్ల కాలం నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న‌ బీజేపీకి, అలాగే 10 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న‌ బీఆరెస్ కు కాంగ్రెస్ పార్టీనే మొద‌టి టార్గెట్ అని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలోఈ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్‌నే టార్గెట్ చేశాయి.

అన్యాయం చేసినా బీజేపీపై ఘాటు వ్యాఖ్య‌ల్లేవు!
వాస్త‌వంగా ఈ 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ‌కు చేసిందేమీ లేద‌న్న విమ‌ర్శ‌లు బ‌లంగానే ఉన్నాయి. విభ‌జ‌న హామీలు మొద‌లుకుని, రాష్ట్రానికి ప్రాజెక్టులు కేటాయించ‌డ వంటి విష‌యాల్లో అన్యాయం చేసింద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అలాంటి బీజేపీపై కాకుండా కాంగ్రెస్ టార్గెట్‌గా విమ‌ర్శ‌లు చేయ‌డమంటేనే ఆ రెండు పార్టీల మ‌ధ్య ర‌హ‌స్య స్నేహ సంబంధాలు ఉన్న‌ట్లు అర్థ‌మ‌వుతోంద‌ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి సామ రామ్మోహ‌న్‌రెడ్డి అన్నారు. శ‌త్రువుకు, శత్రువు మిత్రుడ‌న్న సామెత‌ను ఈ రెండు పార్టీల నేత‌లు సంపూర్ణంగా అమ‌లు చేస్తున్నార‌న్న అభిప్రాయం రాజ‌కీయ పారిశీల‌కుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. ఘాటు వ్యాఖ్య‌లు ప‌క్క‌న‌పెడితే.. ఏదో విమ‌ర్శించాల‌న్న పేరుతోనే విమ‌ర్శ‌లు ఉంటున్నాయ‌ని అంటున్నారు.

బీఆరెస్ గెలిచేదెన్ని?
అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యంతో బీఆరెస్ షాక్ తిన్న‌ది. ఊహించ‌ని పరిణామంతో బీఆరెస్ నేత‌లు కంగుతిన్నారు. పార్టీ శ్రేణులు నైరాశ్యంలోకి వెళ్లాయి. బీఆరెస్‌లో ఉంటే భ‌విష్య‌త్తు లేద‌ని భావించిన అనేక మంది నేత‌లు పార్టీ మారారు. చివ‌ర‌కు పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి కూడా కొంత మంది నేత‌లు ఆసక్తి చూప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. బీ-ఫామ్ తీసుకున్న‌ క‌డియం కావ్య కూడా పార్టీ మారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న‌ది. ఈ ప‌రిణామాల‌తో పార్లమెంటు ఎన్నిక‌ల్లో బీఆరెస్ ఒక్క‌టి రెండు సీట్లైనా గెలుస్తుందా? అన్న సందేహాలు సొంత పార్టీ నేత‌ల్లోనే వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.
బీఆరెస్‌ గెల‌వ‌లేని చోట్ల బీజేపీకి?
మ‌నం గెలిచే ప‌రిస్థితి లేన‌ప్పుడు మ‌న శ‌త్రువు గెలువ‌కుండా అడ్డుక‌ట్ట వేయాలంటే ఏమి చేయాల‌న్న దిశ‌గా బీఆరెస్ నేత‌లు స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు బీఆరెస్‌ గెలిచే స్థానాల్లో మ‌నం ఓట్లు వేసుకోవాలి… గెలువ‌లేని స్థానాల్లో కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా ఉన్న బీజేపీకి ఓట్లు వేయాల‌న్న దిశ‌గా స‌మాలోచ‌న‌లు జరుగుతున్నాయ‌న్న సందేహాలు రాజ‌కీయ వ‌ర్గాల‌లో వ్య క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే ఆ దిశ‌గా బ‌లంగానే లేని ప‌లు స్థానాల్లో బీఆరెస్ ఎన్నిక‌ల ప్ర‌చారం స‌రిగ్గా నిర్వ‌హించ‌డం లేద‌న్న సందేహాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

బీజేపీ గెలిస్తేనే బీఆరెస్‌ అవినీతిపై చ‌ర్య‌లుండ‌వ్‌!
మ‌రో వైపు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌స్తే కాంగ్రెస్ పార్టీ త‌మ‌పై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లు చేయ‌కుండా, కాళేశ్వ‌రం, ఫోన్ టాపింగ్‌, విద్యుత్ కొనుగోళ్లు, ధ‌ర‌ణిపై వ‌స్తున్న అవినీతి ఆరోప‌ణ‌ల‌పై అరెస్ట్‌లు చేయండా త‌దుప‌రి చ‌ర్య‌లు చేప‌ట్ట‌కుండా అడ్డుకోవాలంటే బీజేపీతో స్నేహం అవ‌సరం అన్న తీరుగా బీఆరెస్ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అందుకే ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ టార్గెట్‌గానే విమ‌ర్శ‌లు చేస్తున్నాయి కానీ, అధికారంలో ఉన్న బీజేపీని బీఆరెస్ నేత‌లు ఒక్క మాట కూడ అన‌డం లేద‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ రెండు పార్టీల మ‌ధ్య లోపాయి కారి ఒప్పందం ఉంద‌ని సామ రామ్మోహ‌న్‌రెడ్డి అంటున్నారు.

Latest News