Site icon vidhaatha

Lok Sabha Elections 2024 |ఎన్నికల కమిషన్‌కు పోటాపోటీ ఫిర్యాదులు

సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌, కిషన్‌రెడ్డిలపై ఫిర్యాదు
మాధవీలత, రాజాసింగ్‌లపై కేసు నమోదు

విధాత: పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునంధన్‌రావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడటమే కాకుండా బీజేపీ, బీఆరెస్‌లపైన, ప్రధాని మోదీపైన విమర్శలు గుప్పించారని, రేవంత్ తీరు ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా పేర్కోంటూ రఘునందన్‌రావు ఫిర్యాదు చేశారు.

ఇక బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ నందినగర్‌లో కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడి కాంగ్రెస్‌, బీజేపీలపైన, ప్రధాని మోదీలపైన విమర్శలు గుప్పించారు. కేటీఆర్ చర్యను తప్పుబట్టిన కాంగ్రెస్ ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత పోలింగ్ కేంద్రంలో ముస్లిం మహిళల బుర్ఖాను తొలగింపచేసి వారి ఓటరు, ఆధారు కార్డులను పరిశీలించిన తీరుపై ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో మలక్‌పేట పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఓట‌ర్ల స్లిప్‌ల‌ను ప‌రిశీలించార‌నే ఆరోప‌ణ‌లతో ఆమెపై కేసు న‌మోదు చేశారు. ఐపీసీ సెక్ష‌న్లు 171సీ, 186, 505(10)(సీ), ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టం 132 సెక్ష‌న్ కింద కేసు న‌మోదైంది. మాధవీలత తీరుపై ఎంఐఎం పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది.

అటు మంగల్‌హాట్ పోలీసులు సైతం ప్రిసైడింగ్ అధికారితో దురుసుగా వ్యవహారించారంటూ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు. కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్‌రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఆయనపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ పేరును ప్రస్తావించడంపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. పోలింగ్ రోజు వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కిషన్ రెడ్డిపై ఉల్లంఘన కేసు నమోదు చేయాలని ఈసీని కాంగ్రెస్ కోరింది.

అటు కేసీఆర్ సైతం చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నాక మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ పేరు ప్రస్తావించారు. బీజేపీ స్వంత రూల్స్ ప్రకారం 75 సంవత్సరాల వయస్సు తర్వాత ఎవరూ ఏ పదవిని చేపట్టరని, కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ కూడా తప్పుకోవాలని, ఇప్పుడు భారతదేశంలో ప్రాంతీయ పార్టీల‌దే కీల‌క పాత్ర అని ఇందులో ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించారు.

Exit mobile version