Karnataka Phone Tapping Allegations : కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు!

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కలకలం. డీకే శివకుమార్ ఫోన్లు ట్యాప్ చేశారన్న విపక్ష విమర్శలను సీఎం ఖండించారు.

Karnataka Phone Tapping Allegations

విధాత: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనం రేపిన బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలోని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తరహాలోనే ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చోటుచేసుకున్నాయి. డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, ఆయన మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేసి సమాచారం వింటునట్లు ప్రతిపక్షాలు ఆరోపించడం కన్నడ రాజకీయాల్లో కలకలం రేపింది.

ఏ ప్రభుత్వమైనా గూఢచార శాఖ ద్వారా సమాచారం సేకరిస్తుందని,ఇందులో కొత్తేముందని ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వరన్ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాల ఆరోపణలకు మరింత ఆజ్యం పోశాయి. సిద్దరామయ్య ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేక అధికారినే నియమించి, అనధికార ప్రత్యేక దర్యాప్తు చట్టం(సిట్)ను ఏర్పాటు చేశాడని విపక్ష నేత ఆర్.అశోక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కుర్చీ రక్షణ కోసం సొంత ఎమ్మెల్యేల కదలికలపై సిద్దరామయ్య నిఘా వేసినట్లు కేంద్రమంత్రి కుమారస్వామి సైతం ఆరోపించారు. నేను నిజం చెబుతున్నానని, ప్రతి ప్రభుత్వంలోనూ ఫోన్‌ ట్యాపింగ్‌ సాగిందన్నారు. కానీ సొంత మంత్రులు, సొంత ఎమ్మెల్యేలపై నిఘా పెట్టడం ఇదే మొదటిసారి అని పరోక్షంగా సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌లపై విమర్శలు గుప్పించారు.

అయితే ప్రతిపక్షాల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను సిద్దరామయ్య కొట్టిపారేశారు. పాలు, తేనెల్లాంటి డీకే శివ కుమార్‌కు, నాకు మధ్య ఉన్న బంధాన్ని విడగొట్టడానికి నాపై దుష్ఫ్రచారం చేస్తున్నారని సిద్దరామయ్య పేర్కొన్నారు. ఇవన్ని “అసంతృప్త ఆత్మల నిరాశాజనక ప్రకటనలు” అని అభివర్ణించారు. ఆరోపణలు చేసినవారు గతంలో ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు డీసీఎం, హోం మంత్రిగా వ్యవహరించిన వారన్నారు. ఇంటెలిజెన్స్‌ వారి పాలనలోనూ ముఖ్యమంత్రి వద్దే ఉండేదని, ప్రస్తుతం నాపై చేస్తున్న వారు చేసిన ఆరోపణలు.. వారి అనుభవమా? అని ప్రశ్నించారు. మాది ప్రజాస్వామ్యం కల్గిన కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. ప్రధాని ఎదుట నోరు తెరిచేందుకు, కాళ్లు, చేతులు వణికేలాంటి బీజేపీ కాదని, కుటుంబ ఆధిపత్యం కల్గిన జేడీఎస్‌ కూడా కాదన్నారు. ఆపరేషన్‌ కమల, రిసార్టు రాజకీయాలు, తప్పుడు ఆరోపణలు ఎవరి కాలంలో జరిగాయనేది పరిశీలించుకోవచ్చునన్నారు. మా ఎమ్మెల్యేలు ఎవరూ నాకూ లేదా డీసీఎం డీకే శివకుమార్‌కు అనుచరులు కాదని, అందరూ కాంగ్రెస్‌ వారే అన్నారు.

2018లో కుమారస్వామి సీఎంగా ఉన్నప్పుడు ఆదిచుంచనగిరి మఠాధిపతి నిర్మలానంద నాథస్వామి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని వారి..ప్రస్తుత రాజకీయ మిత్రుడు విజయేంద్ర ఆరోపించారని సిద్దరామయ్య గుర్తు చేశారు. దర్యాప్తు చేసిన సీబీఐ కేవలం ఒక స్వామిజీది కాదని, ఏడుగురు మఠాధిపతుల ఫోన్లు ట్యాపింగ్‌ అయినట్టు తెలిపిందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఐటీ, ఈడీలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వారిపైనే ఉన్నాయని ఎదురుదాడి చేశారు. కుమారస్వామికి ఈ గూఢచర్య పాఠాలు తండ్రి చెప్పి ఉండవచ్చునన్నారు. దేవేగౌడను కాంగ్రెస్‌ పార్టీ ప్రధానమంత్రిని చేస్తే అప్పటి పార్టీ అధ్యక్షుడు సీతారాం కేసరికి వ్యతిరేకంగా గూఢచర్యం జరిపినందుకే కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకుందని సిద్దు చురకలేశారు. కుమారస్వామి, అశోక్‌ కుట్రపూరిత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

ఈ వివాదంపై డిప్యూటీ సీఎం శివకుమార్ స్పందిస్తూ.. నాకు ఎమ్మెల్యేలు, ఢిల్లీ పెద్దలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదని, సీఎం కుర్చీ ఖాళీ అయిన తర్వాతే తన ప్రయత్నాలు మొదలవుతాయని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి :

Odisha Young Farmer | కింద చేప‌ల చెరువు.. పైన సొర‌కాయ‌ల సాగు.. ఏడాదికి రూ. 8 ల‌క్ష‌ల ఆదాయం
Toxic | మార్చ్ 19 నుంచి జూన్ 2కి వాయిదా ప‌డ్డ ‘టాక్సిక్’.. యష్ అభిమానులకు షాక్, కార‌ణం ఏంటంటే..!

Latest News