విధాత:వరంగల్: రామప్ప ఆలయం యునెస్కో వారసత్వ హోదా కోసం పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. యునెస్కో వరల్డ్ హెరిటేజ్‌కు రామప్పతో పాటు డోలవీర ఆలయం నామినేట్ అయినట్లు కేంద్ర పురావస్తు శాఖ ఇటీవల ప్రకటించింది. తొలిసారి రామప్ప ఆలయ చిత్రాలు యునెస్కో అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచడంతో ఈ విషయం అధికారికంగా ధ్రువీకరించినట్లు స్పష్టమవుతోంది. 2020, 21 సంవత్సరాలకు ప్రపంచ వ్యాప్తంగా 41 వారసత్వ కట్టడాలు, సహజ వింతలు.. రెండు కలగలిసినవి ఉండగా 2020 సంవత్సరానికి 24 నామినేషన్లు యునెస్కో పరిశీలనలో ఉన్నాయి.
వాటిలో మన దేశం నుంచి రామప్ప ఆలయం మాత్రమే ఉంది. కాకతీయులు నిర్మించిన అద్భుతమైన ఈ గుడికి సంబంధించిన పదకొండు ఫొటోలను యునెస్కో తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. కోవెలకు సంబంధించిన పూర్తి వివరాలు, నామినేట్ కావడానికి గల కారణాలనూ వివరించింది. ఇక 2021 నామినేషన్లలో మన దేశం నుంచి డోలవీర ఆలయం ఉంది. గతేడాది కొవిడ్ కారణంగా వారసత్వ గుర్తింపు ఇవ్వకపోవడంతో ఈ సారి 2020, 21 రెండు సంవత్సరాలకు ఒకేసారి గుర్తింపు ఇచ్చేందుకు ఈ నెల 16 నుంచి 23 వరకు ఓటింగ్ నిర్వహించనుంది.