Site icon vidhaatha

5గంటలకు రేవంత్ మంత్రివర్గం తొలి భేటీ

విధాత : నూతన ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంత్రివర్గం తొలి భేటీ ఈ రోజు శుక్రవారం 5గంటలకు సచివాలయంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి ప్రకటన వెలువడనుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగునున్న తొలి మంత్రివర్గం సమావేశంలో ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


ఇప్పటికే తెలంగాణ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ ఆరు గ్యారంటీల అమలుకు అభయహస్తం చట్టంపై తొలి సంతకం చేశారు. అనంతరం రేవంత్‌రెడ్డి తను ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగ మరుగుజ్జు తుమ్మల రజినికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ రెండో సంతకం చేశారు. అదే సమయానికి ప్రగతిభవన్ ఇనుప కంచెలను తొలగింపు చర్యలు చేపట్టగా, సీఎంగా రేవంత్‌రెడ్డి తన తొలి ప్రసంగంలో ఇక మీదట ప్రగతిభవన్ పేరును జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా నామకరణం చేశామని ప్రకటించారు.


ఇంతకాలం అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను తొలగించామని, తొలి ప్రజాదర్భార్‌ను రేపు శనివారం నిర్వహిస్తామని, ప్రజలంతా స్వేచ్చగా రావచ్చని ప్రకటించారు. మరోవైపు అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులను ప్రారంభిస్తూ సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రిని, ఇంటలిజెన్స్ చీఫ్‌గా శివధర్‌రెడ్డిలను నియమిస్తూ రేవంత్ మార్క్ పరిపాలన మార్పులకు శ్రీకారం చుట్టారు.

Exit mobile version