విధాత:మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాల కుంభకోణం మంగళవారం వెలుగులోకి వచ్చింది. చలానాల దుర్వినియోగం ను అరికట్టేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చలానాలకు సీఎఫ్ఎంఎస్ కు అనుసంధానం చేసే క్రమంలో మండవల్లి సబ్ రిజిస్ట్రార్ లోని కుంభకోణం బయటపడినట్లు సమాచారం. అనుమానం వచ్చి రికార్డ్ లను జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం కు తీసుకుని వెల్లి తనిఖీ చేయగా మంగళ వారం సాయంత్రానికి సుమారుగా రూ. 1కోటి 37 లక్షల వరకు మోసం జరిగినట్లు గుర్తించామని సిబ్బంది తెలిపారు. స్టాంపు డ్యూటీ ,రిజిస్ట్రేషన్ ఫీజు కోసం చెల్లించే చలనాలను కొందరు దుర్వినియోగం చేసినట్లు సమాచారం.రిజిస్ట్రేషన్ కోసం బ్యాంకులో చలానా తీసి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సమర్పించాక కొందరు మళ్లీ దాన్ని వినియోగిస్తున్నారని, మాన్యువల్ గా చలానా స్వీకరించడం,దాన్ని పిడిఎఫ్ గా అప్లోడ్ చేసే క్రమంలో దుర్వినియోగానికి ఆస్కారం ఉన్నట్లు పలువురు మేధావులు తెలుపుతున్నారు.
అలాగే చలానాలు కట్టి రిజిస్ట్రేషన్ కు రాకుండా వేచి ఉండే వారి చలానాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడిన ఈ ఘటనను పక్కదోవ పట్టించేందుకు పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన పై మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కె. వి. ఎస్. ఎన్ సుబ్రహ్మణ్యం ను వివరణ కోరగా కార్యాలయంలో నకిలీ చాలానాల కుంభకోణం బయటపడ్డ విషయం వాస్తవమేనన్నారు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం కు రికార్డులు పంపగా అక్కడ విచారణ జరుగుతుందన్నారు.ఎంత మొత్తం అనేది బుధవారం వెలుగులోకి రావచ్చన్నారు.మండవల్లి పోలీస్ స్టేషన్ లో కేస్ నమోదు చేశామన్నారు.