Site icon vidhaatha

Narsampet | నర్సంపేటలో బీఆర్ఎస్‌కు షాక్

Narsampet | విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో ముస‌లం పుట్టింది. బీఆర్ఎస్‌కు చెందిన‌ వైస్ చైర్మన్‌ వెంకట్ రెడ్డితో సహా 14 మంది కౌన్సిలర్లు ఆపార్టీ సభ్యత్వానికి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. మరో రెండు రోజుల తర్వాత పదవులకు రాజీనామా చేస్తామని మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వెల్ల‌డించారు. మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ గుంటి రజినీ కిషన్ ఒంటెద్దు పోకడతో విసిగిపోయి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వత్తాసుపలుకుతూ వచ్చారని విమర్శించారు. ఈ వైఖరి నచ్చకే గులాబీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.


గతంలో కూడా చైర్మన్ తీరుకు వ్యతిరేకంగా కౌన్సిలర్లు తిరుగుబాటు ప్రయత్నం చేసినప్పటికీ, అప్పట్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నచ్చ చెప్పడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది. తాజాగా నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారడంతో మరోసారి అసమ్మతి వర్గం నిరసన గళమెత్తినట్లు భావిస్తున్నారు. బీఆర్ఎస్ కౌన్సిల‌ర్ల రాజీనామాల నేప‌థ్యంలో న‌ర్సంపేట మున్సిపాలిటీపై అధికార కాంగ్రెస్ జెండా ఎగరేసే విధంగా తెర వెనుక పావులు కదుపుతున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Exit mobile version