విధాత : కొంతకాలంగా హైవేలను ,శివారు ప్రాంతాలను టార్గెట్ చేస్తూ దారి దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్న పార్థీ ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను అరెస్టు చేసినట్లుగా నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రా తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఎస్పీ పార్థీ ముఠా సభ్యులు అప్పా పాండ్రంగా, శుభం అశోక్‌లను సమావేశంలో హాజరుపరిచి అరెస్టు వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు పార్థీ గ్యాంగ్ సభ్యులను నిన్న అంబర్ పేట వద్ద అదుపులోకి తీసుకున్నామని పేర్కోన్నారు. వారిని పట్టుకునే ప్రయత్నంలో తమ సిబ్బందిపై దాడులకు పాల్పడ్డ నేపథ్యంలో మా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారని తెలిపారు.
పరారీలో ఉన్న కాశ్మీర్ శశిపాల్, ఆదేశ్ అనీల్ ల కోసం గాలిస్తున్నామని తెలిపారు.. పార్థీ ముఠా సభ్యులపై తెలంగాణ వ్యాప్తంగా వీరిపై 33 కేసులు ఉన్నాయని,అందులో ఒక హత్య కేసు కూడా ఉందని చెప్పారు. నల్గొండ జిల్లా,సైబరాబాద్,రాచకొండ కమీషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడ్డ ఈ ముఠా కట్టంగూర్ పీఎస్ పరిధిలో డబ్బుల కోసం ఓ లారీ డ్రైవర్ కొల్లూరి రాజవర్ధన్ ను హతమార్చిందని వివరించారు. దోపిడి చేసే క్రమంలో పార్థీ ముఠా సభ్యులు ఎక్కడా షెల్టర్ తీసుకోరని, 24/7 దోపిడీ లపైనే ఫోకస్ పెడతారని తెలిపారు. దొంగలించిన అభరణాలను మహారాష్ట్రకు వెళ్లి విక్రయిస్తుంటారని తెలిపారు. నిందితుల నుంచి ఒక స్క్రూ డ్రైవర్, రెండు కత్తెరలు, రూ. 17 వేల నగదు, ఒక జత వెండి పట్టీలు, ఒక టార్చ్ లైట్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.