Site icon vidhaatha

Srinivas Goud | కాంగ్రెస్, బీజేపీ తోడుదొంగలు


Srinivas Goud | విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: పాలమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై తన ఓటమికి కారణమయ్యారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలమూరులో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒక్కటై నన్ను ఓడించారన్నారు. ఆ రెండు పార్టీలు తానుచేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక పోయారని, అభివృద్ధిని అడ్డుకునేందుకు రెండు పార్టీల నేతలు కుమ్మక్కై ఓడించారని ఆరోపించారు.


ఎన్నికల సమయంలో మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దె నెక్కిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదన్నారు. గ్రామాల్లోకి వెళ్తే రైతుబంధు రాలేదని, పెన్షన్ రావడం లేదనే ఫిర్యాదులు ఎక్కువ ఉన్నాయని, వ్యవసాయానికి పూర్తి స్థాయిలో కరెంటు ఇవ్వడం లేదని, ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకొని.. వాటిని అమలు చేయడం మరిచిపోయారని విమర్శించారు. తన హయాంలో ప్రజలు ఇచ్చిన హాస్పిటల్ బిల్లులు ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి సీఎం సహాయ నిధి నుంచి ప్రజలకు రూ.30 కోట్ల సహాయం అందించానన్నారు. లివర్ చెడిపోయి ప్రాణాలు పోతుంటే కాపాడిన తనను కాదని ఓ నాయకుడు సైతం పార్టీ మారి ఇతర అభ్యర్థులకు మద్దతు ఇచ్చారన్నారు.


అహర్నిశలు మహబూబ్ నగర్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పని చేశానని, పేదలకు ఉపయోగపడే వెయ్యి పడకల ఆస్పత్రి తీసుకువచ్చానన్నారు. తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంలో విఫలం చెందామని, అందుకే ఓటమికి గురైనట్లు శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు చేసిన తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో వెనుకబడకడామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అధిష్టానం నిర్ణయం మేరకు ప్రతిఒక్కరు పని చేయాలని కోరారు. శాసనసభ ఎన్నికల్లో అందరూ కష్టపడి పని చేసారని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మరింత కష్టపడి పని చేస్తే విజయం వరిస్తుందన్నారు.


గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరి చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ వీడిన వాళ్ళ గురించి పట్టించుకోవద్దని, ఇప్పుడు పార్టీ కోసం పనిచేస్తున్న వారే భవిష్యత్తులో నాయకులు అనే విషయం గుర్తించాలన్నారు. ఇకముందు నాయకులను, కార్యకర్తలను కాపాడుకుంటామని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు రాకుండా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. రైతుబంధు, కరెంట్ లేక రైతు వ్యవసాయం వదిలి వలసపోయే పరిస్థితిని కాంగ్రెస్ నాయకులు తీసుకువచ్చారన్నారు.


బీజేపీ నాయకులు తెలంగాణ, మహబూబ్ నగర్ అభివృద్ధిని ఎన్నడూ పట్టించుకోలేదన్నారు. మాజీ ఎమ్యెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పదవులు, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఢిల్లీ తిరగడం తప్ప ప్రజల గురించి కాంగ్రెస్ నాయకులు ఆలోచన చేయడం లేదన్నారు. ప్రజల్లో వ్యతిరేకత చూసి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతున్నదన్నారు. అంతకుముందు గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ సర్పంచులను సన్మానించారు.


ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొడపాటి చంద్రశేఖర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఇంతియాజ్ ఇసాక్, వెంకటేశ్వర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, డీసీసీబీ చైర్మన్ వెంకటయ్య, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, ఎంపీపీ సుధాశ్రీ, హన్వాడ ఎంపీపీ బాలరాజు, నాయకులు రెహమాన్, శివరాజ్, కరుణాకర్ గౌడ్, గణేష్, ఆంజనేయులు, కృష్ణమోహన్, రమణ రెడ్డి, రవీందర్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, కొండా లక్ష్మయ్య, నరేందర్ పాల్గొన్నారు.

Exit mobile version