Site icon vidhaatha

నేటితో ముగియనున్న ఆసరా దరఖాస్తు గడువు

విధాత:రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన వారందరికీ వృద్ధాప్య పింఛన్ల (ఆసరా)కు సంబంధించి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ప్రభుత్వం ఆసరా అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించి ఈ నెల 15 నుంచి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తుతో పాటు సంబంధిత లబ్ధిదారుడి బయోమెట్రిక్‌ తప్పనిసరి చేసింది. మొదట్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకున్నా రెండు రోజులుగా లబ్ధిదారుల తాకిడితో సర్వర్‌పై ఒత్తిడి పెరిగి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోవడం, ఆధార్‌ వివరాల ధ్రువీకరణ కాకపోవడంతో ఒక్కో దరఖాస్తుకు అరగంటకుపైగా సమయం పడుతోంది.

ప్రభుత్వ అంచనాల మేరకు 57 ఏళ్లకు పైబడిన అర్హులు కనీసం 8 లక్షలకు పైగా ఉంటారని అంచనా. దరఖాస్తు సమయంలో ధ్రువీకరణకు వేలిముద్రలు పడనివారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని మీ-సేవా నిర్వాహకులు చెబుతున్నారు. ఇటీవల తాకిడి పెరగడంతో భౌతిక దూరం పాటించడం కష్టం అవుతోందని, గడువు కొంతకాలం పొడిగిస్తే కరోనా నిబంధనలు పాటించి దరఖాస్తులు స్వీకరించేందుకు వీలవుతుందని వారు పేర్కొంటున్నారు

Exit mobile version