- కారు దిగి చేయి అందుకున్న ఎమ్మెల్యేలు
- వారికి వ్యతిరేకంగా బీఆరెస్ న్యాయపోరాటం
- ఏప్రిల్‌లో తీర్పు రిజర్వ్.. నేడు వెల్లడి
Telangana MLAs disqualification | హైదరాబాద్, జూలై 30 (విధాత): బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల కేసులో గురువారం తీర్పు వెలువడనున్నది. వీరిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుదీర్ఘవాదనలు విని, ఏప్రిల్‌లో రిజర్వ్ చేసిన తీర్పును సుప్రీంకోర్టు గురువారం వెల్లడించనున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), ఎం సంజయ్ కుమార్ (జగిత్యాల), కాలె యాదయ్య (చేవెళ్ల), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), మహిపాల్ రెడ్డి (పటాన్ చెరు), పోచారం శ్రీనివారెడ్డి (బాన్సువాడ) విడతలవారీగా కాంగ్రెస్‌లో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదుపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుకు వ్యతిరేకంగా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
సుదీర్ఘ వాదనలు..
గతంలో మేఘాచంద్ర కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారంగా పార్టీల ఫిర్యాదులపై మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోనేలా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును కోరింది. స్పీకర్‌కు సూచనలు చేసే అంశంపై ఉన్నత న్యాయస్థానం తీర్పును ఇవ్వనుంది. స్పీకర్ నిర్ణయం తీసుకొనేలా కోర్టులు జోక్యం చేసుకోవచ్చా? అనే అంశంపై వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.