స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ముగిసిపోగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో ఎన్నికల సంఘం అందుకు అవసరమైన కసరత్తు చేస్తుంది

  • Publish Date - April 24, 2024 / 02:56 PM IST

బీసీ రిజర్వేషన్ల ఖరారుకు కసరత్తు
బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు
ఎన్నికల నిర్వాహణకు అనేక చిక్కు ముడులు

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ముగిసిపోగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో ఎన్నికల సంఘం అందుకు అవసరమైన కసరత్తు చేస్తుంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సైతం పార్లమెంటు ఎన్నికల ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కూడా అందుకు అసరమైన సన్నాహాలు చేస్తుంది.

స్థానిక సంస్థల ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్ పద్దతిలో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మే 15వ తేదీలోగా బ్యాలెట్ బాక్స్‌లకు సీళ్లు, అడ్రస్ ట్యాగ్‌లను ముద్రించాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ను ఆదేశించింది. రాష్ట్రంలో సర్పంచ్‌ల పదవీ కాలం జనవరి 31తో ముగిసింది. ఫ్రస్తుతం పంచాయతీల్లో స్పెషల్ అధికారుల పాలన కొనసాగుతుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీల గడువు కూడా ఈ ఏడాది జూన్‌తో ముగుస్తున్నది. అత్యధిక పట్టణ స్థానిక సంస్థల పదవీ కాలం కూడా వచ్చే జనవరిలో పూర్తికానున్నది.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందు బీసీ రిజర్వేషన్ ఖారురు కావాల్సి ఉంది. బీసీ కమిషన్ రిపోర్టు తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై విధాన నిర్ణయం తీసుకోనున్నది. తొలుత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది. అయితే ఈ ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా బీసీ రిజర్వేషన్ ఖరారు కావాల్సి ఉంది. రిజర్వేషన్లు ఖరారు చేయాల్సిందిగా అటు స్టేట్ బీసీ కమిషన్‌కు, ఇటు ప్రభుత్వానికీ ఎలక్షన్ కమిషన్ లేఖలు రాసింది.

రిజర్వేషన్ కసరత్తులో బీసీ కమిషన్‌

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణకు వీలుగా బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణా మోహన్ నేతృత్వంలో కసరత్తు చేపట్టారు. జూన్ 4వ తేదీతో పార్లమెంటు ఎన్నికల కోడ్‌ ముగిసిన రెండు నుంచి మూడు నెలల వ్యవధిలో ఇంటింటి సర్వే..అభిప్రాయ సేకరణ నిర్వహణతో నివేదిక తయారుచేసి ఆమోదించుకోవడం ద్వారా రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ నివేదిక అందితే ఆ మేరకు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే అవకాశముంటుంది. పార్లమెంటు ఎన్నికలు కాగానే గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత జూలై రెండోవారంకల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించి పాలనపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేలని ప్రభుత్వం భావిస్తుంది.

కులగణనతో కొత్త చిక్కులు

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీసీ(డెడికేటెడ్‌) కమిషన్‌ ఇచ్చే నివేదికను ప్రాతిపదికగా తీసుకొని బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలి. అయితే ప్రభుత్వం కొత్తగా కులగణనను తెరపైకి తీసుకొచ్చింది. బీసీ కులాలే కాదు అన్ని కులాల లెక్కలను తేల్చాలని నిర్ణయించింది. అయితే ఇందుకు సంబంధించిన క్షేత్రస్థాయి పనులు ఇంకా ప్రారంభం కాలేదు. పార్లమెంటు ఎన్నికల కోడ్‌ ముగిసిన తరువాత కనీసం రెండు మూడు నెలలు పూర్తిస్థాయిలో దృష్టి పెడితే తప్ప కులగణన వ్యవహారం ఒక కొలిక్కిరాదని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో బీసీ కమిషన్ నివేదిక మేరకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారా లేక కొత్తగా మరేదైనా కమిషన్‌ ఏర్పాటు చేస్తారా? అన్నది తేలాల్సివుంది.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ‘డెడికేటెడ్‌ కమిషన్‌’ ఇచ్చే నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లను ఖరారు చేసి కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఆ నివేదికపై సుప్రీంకోర్టు సంతృప్తి చెందితేనే, కోర్టు అనుమతితో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. నివేదికపై ఏమైనా అభ్యంతరాలు వ్యక్తమైతే మరింత సమయం పట్టే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. రిజర్వేషన్ల కసరత్తుకే మూడు నాలుగు పడితే ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశం లేకపోలేదంటున్నారు.

వార్డుల విభజనతో మరింత జాప్యం

రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సివుంది. గవర్నర్ వద్ద రాష్ట్రంలోని 224 నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు ఫైల్ పెండింగ్‌లో ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ సమయం వరకు నూతన 224 గ్రామ పంచాయతీల ఏర్పాటు పెండింగ్ ఫైల్ పై సంతకం పెడితే మొత్తం 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఒకవేళ గవర్నర్ సంతకం పెట్టని పక్షంలో 224 నూతన పంచాయతీలను వదిలేసి పాత గ్రామ పంచాయతీలు అయిన 12,769 గ్రామపంచాయతీలకే ఎన్నికలు నిర్వహిస్తారు. బీఆరెస్ ప్రభుత్వం రూపొందించిన 2018పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వరుసగా 10ఏండ్లు ఒకే రిజర్వేషన్ ఉంటుంది. ప్రభుత్వం మారినందునా ఈ చట్టాన్ని సవరిస్తే మళ్లీ కొత్తగా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సివుంటుంది.

కొత్తగా పంచాయతీలను వార్డులవారీగా విభజించడంతో పాటు కొత్త ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేయడం, పునర్విభజన చేయడం వాటి ఆధారంగా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం తయారు చేయాల్సివుండటం.. పోలింగ్‌ కేంద్రాల ఖరారు వంటి ప్రక్రియల నిర్వాహణకు మరింత సమయం పట్టే అవకాశముంది. వాటికి సంబందించిన రిజర్వేషన్ల ఖరారు అతి పెద్ద సవాల్‌. దీనికి తోడు కొత్త గ్రామ పంచాయతీల డిమాండ్‌..పలు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారడంతో పాటు పలు గ్రామాలు మున్సిపల్ కార్పోరేషన్లలో విలీనం వంటి సమస్యలు ఉన్నాయి. వీటన్నింటికీ చట్ట సవరణ చేయాల్సివుంటుంది. అసెంబ్లీలో బిల్లు పెట్టడమో లేదా ఆర్డినెన్స్‌ ఇవ్వడమో చేయాల్సివున్నందునా దీనికి కూడా మరింత సమయం పట్టనుంది.

అదిగాక కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో, బీసీ, ఎస్సీ డిక్లరేషన్లలో వారి రిజర్వేషన్ల శాతాన్ని వారి జనాభా ప్రాతిపదిక పెంచుతామని హామీ ఇచ్చింది. స్థానిక సంస్థల్లో ఎస్సీలకు 18%, బీసీలకు 42% ప్రాతినిధ్యం కల్పిస్తామని ప్రకటించింది. సుప్రీంకోర్టు గత ఎన్నికల సమయంలో పేర్కొన్న ప్రకారం.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీలులేదు. కాంగ్రెస్‌ హామీ అమలు కావాలంటే తమిళనాడు తరహాలో పార్లమెంట్‌ ద్వారా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో రిజర్వేషన్ల శాతాన్ని చేర్చాల్సి ఉంటుందంటున్నారు విశ్లేషకులు.

అలా అయితేనే కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధం గా రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుందంటున్నారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీలకు 24% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఈ రిజర్వేషన్ల ఖరారు..కోటా నిర్ణయం…ఎన్నికల సన్నాహాలు ఇవన్ని జూన్-జూలైలోగా పూర్తి కావడం అసాధ్యమన్న వాదన వినిపిస్తుండటంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఆక్టోబర్ దాకా వెళ్లవచ్చంటున్నారు విశ్లేషకులు.

Latest News