Telangana | రాష్ట్ర అవసరాలకే సన్నాల సాగు!.. ప్రభుత్వ బోనస్‌ ప్రకటన ఇందుకే

రాష్ట్ర ప్రభుత్వం రానున్న వానకాలం సీజన్‌ నుంచి సన్న వడ్లకు రూ. 500 బోనస్‌ ఇస్తామని ప్రకటించింది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.

  • Publish Date - May 22, 2024 / 09:37 AM IST

తినేదంతా సన్నబియ్యమే
కొరతతోనే మార్కెట్‌ డిమాండ్‌
వినియోగదారులకు అందనంత దూరంలో రేట్లు
రాష్ట్రమంతా సన్నవడ్ల సాగుకు అనుకూల వాతావరణం
గడిచిన రెండేళ్లలో భారీగా దొడ్డు బియ్యం సాగు
గణనీయంగా తగ్గిన సన్నబియ్యం సాగు

విధాత: రాష్ట్ర ప్రభుత్వం రానున్న వానకాలం సీజన్‌ నుంచి సన్న వడ్లకు రూ. 500 బోనస్‌ ఇస్తామని ప్రకటించింది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. సన్నవడ్లకు బోనస్‌ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నది మంత్రులు స్పష్టం చేశారు. రాష్ట్ర అవసరాలకు ఏటా 36 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరమని, దీనికోసం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నందున ఈ ఏడాది బియ్యమంతా రాష్ట్రంలోనే సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందుకే సన్న వడ్ల సాగును ప్రోత్సహించడానికే బోనస్‌ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. ఎక్కడ ఎలాంటి రకాలు వేసుకోవాలో వ్యవసాయ అధికారులు ప్రకటిస్తారని మంత్రులు చెప్పారు.

దీనిపై అధికార, విపక్షాల మధ్య విమర్శలు మొదలయ్యాయి. రాష్ట్ర వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సన్నవడ్ల అన్నిచోట్ల సాగు కావని, ఎన్నికలకు ముందు అన్నిరకాల వడ్లకు బోనస్‌ ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు మాట మారుస్తున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులున్నా అన్నిచోట్లా సాగుకు అవకాశాలున్నాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం ఎందుకు సాగు చేయమని రైతులకు సూచిస్తున్నది? అవి సాగు చేసే రైతులకు బోనస్‌ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నది ఈ కథనం ఉద్దేశం.

కొంతకాలంగా దేశంతో పాటు రాష్ట్రంలోనూ భారీ మొత్తంలో దొడ్డు బియ్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. దీనికితోడు ప్రతి సీజన్లోనూ రాష్ట్రంలోని రైతులు పెద్ద మొత్తంలో దొడ్డు రకం వడ్లను సాగు చేస్తున్నారు. దీంతో వాటి నిల్వలు పెరిగిపోతుండగా, సన్న రకాలకు కొరత ఏర్పడుతున్నది. ఫలితంగా మార్కెట్లో సన్న బియ్యం రేట్లు వినియోగదారులకు అందనంతగా పెరిగిపోతున్నాయి. వస్తు కొరత ఏర్పడితే డిమాండ్‌ పెరుగుతుంది అన్నట్టు మార్కెట్లో సన్న బియ్యం కొరత ఉండటంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నది తెలిసిందే. రాష్ట్ర అవసరాలు, రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని తెలుస్తోంది.

అలాగే మధ్యాహ్న భోజన పథకం, సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తోంది. రేషన్‌ కార్డుదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నది. కాంగ్రెస్‌ ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చే రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ద్వారా సన్న బియ్యాన్నే సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు దాన్ని నిలబెట్టుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నది.

ఏటా వానకాలం, యాసంగి రెండు పంట సీజన్లలోనూ కస్టమ్ మిల్లింగ్ చేయించిన బియ్యాన్ని రాష్ట్రంలో ప్రజాపంపిణీ అవసరాలకు ప్రభుత్వం వినియోగిస్తున్నది. ఒకవైపు రైతుల నుంచి సేకరించిన దొడ్డు బియ్యం నిల్వలు పేరుకుపోతుంటే సన్న బియ్యం కోటా మన రాష్ట్ర పంపిణీ అవసరాలకు కూడా సరిపోవటం లేదు. గత ప్రభుత్వం వలె వరి వేస్తే ఉరే అన్నట్టు ప్రస్తుత ప్రభుత్వం చెప్పడం లేదు. సన్న వడ్లు సాగు చేసే వారిని ప్రోత్సహిస్తామని చెబుతున్నది. అలాగని దొడ్డు వడ్లు సాగు చేసినా కనీస మద్దతు ధర ప్రకారమే కొనుగోలు చేస్తామన్నది. కాబట్టి ఈ విషయంలో రైతుల్లో ఎలాంటి గందరగోళం లేదని విపక్షాలు కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించింది. రైతులను రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చూస్తున్నదని మండిపడుతున్నది.

రేషన్ షాపుల ద్వారా (రాష్ట్ర ప్రభుత్వ కార్డులు, జాతీయ ఆహార భద్రత కార్డుల కింద) ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రజా పంపిణీ వ్యవస్థకు అవసరం. అంటే 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సమానం. అలాగే దొడ్డు బియ్యం తినేందుకు రేషన్ కార్డుదారులు ఇష్టపడటం లేదు. చాలాచోట్ల వీటిని అమ్ముకుంటున్న ఉదంతాలున్నాయి. అందుకే సన్నాల సాగు పెరిగితే రాష్ట్రంలోని రేషన్ షాపుల ద్వారా కూడా ఈ బియ్యాన్ని పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది.

రాష్ట్ర సివిల్ సప్లయిస్ విభాగం మిల్లింగ్ చేయిస్తున్న వాటిలో దొడ్డు బియ్యం 98 శాతం ఉండగా.. సన్న బియ్యం ఒకటీ రెండు శాతం మించి ఉండటం లేదు. మారిన అవసరాలకు అనుగుణంగా రైతులు దొడ్డు రకాలకు బదులు సన్నరకాల వరి సాగుపై దృష్టి సారిస్తే ఈ పరిస్థితిని అధిగమించే వీలున్నది. దొడ్డు రకంతో పోలిస్తే సన్న ధాన్యాల దిగుబడి కొంత తగ్గుతుంది. అందుకే రైతులు దొడ్డు రకం ధాన్యం ఎక్కువగా సాగు చేస్తున్నారు. కానీ సన్న ధాన్యానికి బోనస్ ఇవ్వటం ద్వారా రైతులకు వచ్చే దిగుబడి నష్టాన్ని పూడ్చే వీలుంటుందని ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తున్నది.

వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం 2019–20లో రాష్ట్రంలో 91.45 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం వడ్ల దిగుబడి ఉండగా. 86.79 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం దిగుబడి వచ్చింది. 2020–21 లో 125.51 లక్షల మెట్రిక్ టన్నుల సన్న దాన్యం, 93.01 లక్షల దొడ్డు ధాన్యం, 2021–22లో 105.90 లక్షల మెట్రిక్ టన్నులు సన్నవి, 96.26 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం దిగుబడి వచ్చింది. 2022–23లో 178.46 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం, కేవలం 79.74 లక్షల సన్న ధాన్యం, 2023–24లొ 174.18 లక్షల దొడ్డు ధాన్యం, 86.26 లక్షల సన్న ధాన్యం దిగుబడి వచ్చింది. గడిచిన రెండేళ్లలో దొడ్డు బియ్యం సాగు భారీగా పెరిగిపోయి సన్న ధాన్యాల సాగు గణనీయంగా తగ్గిపోయింది.

కానీ మార్కెట్లో సన్న రకాల డిమాండ్, వినియోగం ఎక్కువగా ఉన్నది. అందుకే రేటు కూడా ఎక్కువ. ఈ నేపథ్యంలోనే సన్న రకాల వరి సాగు పెరిగేలా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బోనస్‌పై రైతుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కావడం లేదు. వ్యవసాయ నిపుణులూ రాష్ట్రంలో అన్నిప్రాంతాల్లో సన్న రకాలు సాగు చేయడానికి అనుకూల వాతావరణం ఉన్నది. కాబట్టి ప్రాంతాల వారీగా అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి రకం సాగు చేయాలన్నది వ్యవసాయ నిపుణులు సూచిస్తారు. రైతుల సంక్షేమం కోరే వారు ఎవ్వరూ ఈ అంశంపై రాజకీయం చేయకుండా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని రైతుల వాదన.

Latest News