Site icon vidhaatha

Telangana | లోక్‌సభ సమరానికి పార్టీల సన్నాహాలు

Telangana | విధాత : తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు లోక్‌సభ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్‌, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆరెస్‌ పార్టీలు తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ స్థానాలు సాధించేందుకు త్రిముఖ పోటీకి ఢీ అంటే ఢీ అంటున్నాయి.


లోక్‌సభ ఎన్నికల సమరానికి ముందుగా కాంగ్రెస్‌ పార్టీ సంసిద్ధమవుతున్నది. ఫిబ్రవరిలో 2వ తేదీన ఇంద్రవెల్లిలో కాంగ్రెస్‌ బహిరంగ సభ ద్వారా సీఎం రేవంత్‌ రెడ్డి ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికల సమర శంఖాన్ని పూరించబోతున్నారు. ఇంద్రవెల్లి మొదలుకుని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో వరుస ప్రచార సభలు నిర్వహించనున్నట్లుగా రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

ఇంద్రవెల్లి సభ ఏర్పాట్లపై మంగళవారం గాంధీ భవన్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే టీ జగ్గారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడ్మ బొజ్జు, మోత్కుపల్లి నర్సింహులు, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నాయకులు సమీక్ష నిర్వహించారు. ఇంద్రవెల్లి సభ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అటు ఎంపీ అభ్యర్థుల ఎంపికకు కూడా కసరత్తు చేస్తునే ఇటు ప్రచార సభలకు కాంగ్రెస్‌ సమాయత్తం కావడం విశేషం.


10 నుంచి బీజేపీ బస్సు యాత్రలు


లోక్‌సభ ఎన్నికల్లో గతంలో గెలిచిన నాలుగు సీట్లకు తోడు మరో నాలుగైదు సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ నాయకత్వం ప్రజల్లో పట్టుకోసం ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు తొలి విడత బస్సు యాత్రలకు సిద్ధమైంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలను నాలుగు క్లస్టర్లుగా విభజించి బస్సుయాత్రల నిర్వహణకు పూనుకొన్నది. ‘ఫిర్‌ ఏక్‌ బార్‌ మోదీ సర్కార్‌’ నినాదంతో ఫిబ్రవరి 10న భువనగిరి పార్లమెంటు పరిధిలో యాదాద్రి ఆలయంలో పూజల అనంతరం జనగామలో బస్సుయాత్ర ప్రారంభించనున్నారు.

అక్కడి నుంచి రథయాత్ర 13న మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోకి ప్రవేశించనుంది. 17, 18 తేదీల్లో హైదరాబాద్‌, 19న సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో రథయాత్ర కొనసాగనుంది. ఈ రథయాత్ర ప్రచార సభలకు పార్టీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు హాజరుకాబోతున్నారు. ఇప్పటికే బీజేపీ నుంచి నలుగురు సిటింగ్‌లకే మళ్లీ టికెట్లు ఇవ్వడంతో పాటు మిగతా సీట్లలో పోటీ చేసే అభ్యర్థులకు ఎంపికపై కూడా బీజేపీ అధిష్ఠానం ఫోకస్‌ పెంచిందని చెబుతున్నారు.


బీఆరెస్‌ ముందస్తు సన్నాహాల జోరు


అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో షాక్‌లో ఉన్న బీఆరెస్‌ నాయకత్వం లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించే లక్ష్యంతో ముందస్తుగానే ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే 17 లోక్‌సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు పూర్తి చేసుకున్న బీఆరెస్‌ పార్టీ ఈ నెల 27నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నది. రోజుకు 10 చొప్పున ఫిబ్రవరి 10 కల్లా అసెంబ్లీ సమావేశాలను పూర్తి చేయాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నది.


తెలంగాణ హక్కుల కోసం కొట్లాడే పార్టీ బీఆరెస్‌ మాత్రమేనంటూ ప్రచారం చేస్తూనే.. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్ర విభజన సమస్యలు, తెలంగాణకు రావాల్సిన అభివృద్ధి నిధులపై కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించడం ద్వారా లోక్‌సభ ఎన్నికల వేళ ప్రజల్లో తమ పార్టీ మైలేజీ పెంచుకోవాలనే వ్యూహ రచన సైతం చేసింది. అలాగే ఎంపీ ఎన్నికల గెలుపు వ్యూహాల్లో భాగంగా సిటింగ్‌లలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, జహీర్‌బాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ను కొనసాగించడంతోపాటు కరీంనగర్‌ నుంచి వినోద్‌ కుమార్‌ను నిలబెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు అధిష్ఠానం పెద్ద కసరత్తునే చేస్తున్నదని సమాచారం.


20 నుంచి కేసీఆర్‌ పర్యటనలు


ఫిబ్రవరి 1న శాసనసభ్యుడిగా ప్రమాణం చేయనున్న కేసీఆర్.. 20 నుంచి నియోజకవర్గాల పర్యటనలు చేస్తారని తెలుస్తున్నది. గజ్వేల్‌ నుంచే పర్యటనలు మొదలవుతాయని, లోక్‌సభ ఎన్నికల ప్రచారం గతంలో మాదిరిగానే వరంగల్‌ నుంచి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

Exit mobile version