Site icon vidhaatha

Warangal: జాబ్ మేళాలో అపశృతి.. తోపులాటలో ముగ్గురికి గాయాలు

విధాత ప్రత్యేక ప్రతినిధి: నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన విషయంలో గత ప్రభుత్వహయాంలో 10సంవత్సరాలు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రాష్ట్ర మంత్రులు కొండ సురేఖ, ధనసరి సీతక్క మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 60వేల ఉద్యోగాలు కల్పించామనీ అన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టం.. అందుకే ఇలాంటి జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని వివరించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. వరంగల్ ఎం కే నాయుడు కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు స్థానిక ఎమ్మెల్యే, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

 

ఇదిలాఉండ‌గా.. ఈ జాబ్ మేళాకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారు. అయితే.. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా జాబ్ మేళాలో అపశృతి జరిగింది. చిన్న ఫంక్షన్ హాల్ లో జాబ్ మేళా నిర్వహించి, పెద్ద ప్రచారం చేపట్టడంతో పెద్ద సంఖ్యలో హాజరైన నిరుద్యోగుల మధ్య తొక్కిసలాట జరిగి ముగ్గురు సొమ్మసిల్లి పడిపోయారు. ఒక దశలో పోలీసులు, నిర్వాహకులు చేతులెత్తేయడంతో జాబ్ మేళాకు హాజరైన నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. తొక్కిసలాటలో సొమ్మసిల్లి పడిపోయిన ముగ్గురిని హుటా హుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. మేళాకు హాజరైన నిరుద్యోగులు ఒక్కసారిగా తోచుకోవడంతో ఫంక్షన్ హాల్ ప్రధాన ద్వారం అద్దాలు పగిలిపోయాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు పడడంతో ముగ్గురు అమ్మాయిలకు గాయాలయ్యాయి.

ఈ జాబ్ మేళాలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిపిస్తామని అందులో భాగంగానే ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పై ప్రత్యేక దృష్టి సాధించారని అన్నారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగం దక్కుతోందన్నారు. ఓపికతో ఇంటర్వ్యూ పూర్తి చేసి ఉద్యోగం సాధించాలని కోరారు.

తెలంగాణ తెచ్చుకుంది ఉద్యోగాల కోసమని, కానీ కేసీఆర్ పాలనలో 10 ఏళ్లలో 10వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 60వేల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. త్వరలో అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. అవకాశాలు వస్తే వాటిని వదులుకోవద్దని వాటిని ఉపయోగించుకుని తల్లిదండ్రులకు భరోసా కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే,రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అప్జల్ బియాబాని ఖుస్రో పాషా, అదనపు కలెక్టర్ సంధ్య రాణి, కార్పొరేటర్లు, జిల్లా, జిడబ్ల్యూఎంసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Exit mobile version