Site icon vidhaatha

Toor Dal price | సామాన్యులకు షాకిస్తున్న కందిపప్పు.. కిలో ధర రూ.180 నుంచి 200..!

Toor Dal price : రాష్ట్రంలో కందిపప్పు ధరలు సామాన్యులకు షాకిస్తున్నాయి. కందిపప్పు పేరు వింటేనే సామాన్యులు భయపడేలా దాని ధరలు కొండెక్కి కూర్చున్నాయి. నిన్న, మొన్నటి వరకు రిటైల్ మార్కెట్లో రూ.150-160గా ఉన్న కేజీ కందిపప్పు ధర ఇప్పుడు రూ.180-200 పలుకుతోంది. ఇక సూపర్‌ మార్కెట్లలో అయితే రూ.220కి పైనే విక్రయిస్తున్నారు.

కందిపప్పుతోపాటు ఇతర పప్పుల ధరలు కూడా గత నెలతో పోల్చితే భారీగానే పెరిగాయి. మినప్పప్పు ధర గత నెల కేజీ రూ.90-120 ఉండగా ప్రస్తుతం రూ.140-160కి పెరిగింది. అదేవిధంగా పెసరపప్పు కూడా కేజీ ధర రూ.100 నుంచి రూ.120కి చేరింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈసారి పప్పుల ఉత్పత్తి 40 శాతం తగ్గిందని, అందుకే రేట్లు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.

ఇప్పటికే పెరిగిన కూరగాయలు, ఉల్లిగడ్డల ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం దాదాపుగా ఏ కూరగాయ చూసినా కిలో రూ.80కి తక్కువ లేదు. ముఖ్యంగా టమాటా ధర కూడా సామాన్యులకు అందనంత ఎత్తులోనే ఉంటోంది. ఉల్లిగడ్డల ధరలు కూడా కిలో రూ.50కి పైనే ఉన్నాయి. వీటికి తోడు ఇప్పుడు పప్పుల ధరలు కూడా పెరగడంతో పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది.

Exit mobile version