Site icon vidhaatha

TS | గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్‌

TS | విధాత: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించిన కేసులో హైకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కొత్త నియామకాలపై గతంలో తాము వేసిన కేసు తేలే వరకు స్టే విధించాలని పిటిషనర్లు దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణ మధ్యంతర పిటిషన్ల ద్వారా హైకోర్టును కోరారు.


ఈ వివాదంపై మంగళవారం ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరామ్‌, మీర్ అమీర్ అలీఖాన్‌ల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ వేసింది. ఫిబ్రవరి 8వరకు యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాల్చింది. కేసు విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలతో బుధవారం జరుగాల్సిన కోదండరామ్‌, మీర్ అమీర్ అలీఖాన్‌ ప్రమాణ స్వీకారం మరికొన్ని రోజులు వాయిదా పడినట్లయ్యింది.


గత బీఆరెస్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణలను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించగా, ఆ ప్రతిపాదనలు నిబంధనల మేరకు లేవంటూ గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్‌ తిరస్కరించారు. గవర్నర్ నిర్ణయాన్ని శ్రవణ్‌, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు విచారణలో ఉండగానే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్‌, సియాసత్ ఎడిటర్ మీర్ అమీర్‌ అలీఖాన్‌ను ఎంపిక చేసింది.


ఈ ప్రతిపాదనలను గవర్నర్ ఆమోదించారు. ఈ నియామకాలను సవాల్ చేసిన శ్రవణ్‌, సత్యనారాయణ.. తాము గతంలో వేసిన కేసు తేలేవరకు కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌ నియామకాలపై స్టే విధించాలని హైకోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు కోదండరామ్‌, మీర్ అమీర్‌ అలీఖాన్‌ ప్రమాణాస్వీకారానికి బ్రేక్ వేస్తూ ఫిబ్రవరి 8వ తేదీ వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఈ పరిణామం కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇటు గవర్నర్‌కు కూడా కొంత ఇబ్బందికరంగా మారింది.

Exit mobile version