– మేడారంలో అమ్మవార్లకు మొక్కులు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బీజేపీ అధికారంలోకి వస్తే జనాభా ప్రాతిపదికన గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. విద్యా, ఉపాధి రంగాల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా, ఈ హామీని అమలు చేయలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క పేరుతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, బుధవారం బీజేపీ నేతల బృందం మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాల సంరక్షణ కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ విశ్వ గురువుగా ఎదగాలని సమ్మక్క సారలమ్మను ప్రార్థించినట్లు చెప్పారు. రూ.900 కోట్లతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేందుకు కృషి చేశామని, అల్లూరి జయంతిని గొప్పగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాదులో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేశామని చెప్పారు. గిరిజన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. ములుగు జిల్లాలో ట్రైబల్ సర్క్యూట్ ఏర్పాటు చేసి టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టామని వివరించారు.
మేడారాన్ని జాతీయ పండగగా నిర్వహిస్తాం : ఈటల రాజేందర్
గిరిజనుల ఆరాధ్య దైవమైన మేడారాన్ని జాతీయ పండుగగా నిర్వహిస్తామని బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తెచ్చి అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. పెద్దఎత్తున జరిగే జాతరకు తగిన ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజల విశ్వాసాలు, సంస్కృతిని రక్షించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సీట్లు, ఓట్లు పార్టీకి ప్రధానం కాదని, గిరిజన సంక్షేమం, అభివృద్ధి తమ లక్ష్యం అని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నేతలు గరికపాటి మోహన్రావు, రవీంద్ర నాయక్, చాడా సురేష్ రెడ్డి, అజ్మీరా ప్రహ్లాద్, రావు పద్మ, గిరిజన మోర్చా నాయకులు పాల్గొన్నారు.