Site icon vidhaatha

Women’s Bill | మహిళా బిల్లుపై చర్చలో అధ్యక్షులు ఈ మహిళా ఎంపీలే

omen’s Bill

విధాత‌: లోక్‌సభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు గురువారం రాజ్యసభలో ప్రవేశించింది. దీనిపై దాదాపు ఏడున్నర గంటల పాటు చర్చ జరుగుతుంది. బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌.. దాని ఉద్దేశాలను సభకు వివరించారు. దీనిని తీసుకురావడానికి మోదీ చేసిన కృషిని ఏకరువు పెట్టారు. ఏఏ స్థానాలు మహిళలకు కేటాయించేదీ డీలిమిటేషన్‌ కమిషన్‌ నిర్ణయిస్తుందని చెప్పారు.

అంతకు ముందు రాజ్యసభ చైర్మన్‌ జగ్దీప్‌ ధన్‌కర్‌ మాట్లాడుతూ.. రాజ్యసభలో మహిళా బిల్లుపై చర్చ సందర్భంగా సభాకార్యక్రమాల నిర్వహణలో పీటీ ఉష, జయాబచ్చన్‌ (ఎస్పీ), ఫాజియాఖాన్‌ (ఎన్సీపీ), దోలా సేన్‌ (టీఎంసీ), కనిమొళి ఎన్‌వీఎన్‌ సోము (డీఎంకే) ఉపాధ్యక్షులుగా వంతులవారీగా వ్యవహరిస్తారని ప్రకటించారు. మహిళా బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత మెజార్టీ అసెంబ్లీలు ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది.

అనంతరం జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన సమయంలో మహిళలకు కేటాయించే స్థానాలను నిర్ణయిస్తారు. మహిళా బిల్లును ఆమోదించేందుకు 1996 నుంచీ జరుగుతున్న ఏడో ప్రయత్నం ఇది. దాదాపు 95 కోట్ల దేశ ఓటర్లలో సగభాగం ఉన్న మహిళలకు లోక్‌సభలో ప్రస్తుతం 15 శాతం, అసెంబ్లీ ల్లో పది శాతం ప్రాతినిధ్యం మాత్రమే ఉన్నది. తాజా బిల్లుతో లోక్‌సభ, అసెంబ్లీల్లో వారి ప్రాతినిథ్యం 33 శాతానికి చేరుకుంటుంది. అయితే.. ఎగువ సభ అయిన రాజ్యసభ, రాష్ట్రాల శాసనమండళ్లలో మాత్రం ఇది అమలు కాదు.

Exit mobile version