విధాత:ఒకవైపు దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండగా, యువత ఉద్యోగాలు కోసం ఎదురుచూస్తుంటే.. మరోవైపు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 8.72 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఖాళీగా ఉన్నాయి. ఈ వివరాలను కేంద్రమే గురువారం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. ఈ సంఖ్య కూడా గత ఏడాది మార్చి 1 నాటిది. ‘మార్చి1, 2020 నాటికి మొత్తం 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయి’ అని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల్లో మార్చి 1, 2020 నాటికి మొత్తం ఉద్యోగాల సంఖ్య 40,04,941గా ఉండగా, 31,32,698 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని మంత్రి సమాధానంలో తెలిపారు. 8,72,243 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.గత ఐదేళ్లలో మూడు ప్రధాన నియామక సంస్థలు చేసిన నియామకాల వివరాలను కూడా మంత్రి వెల్లడించారు. 2016-17 నుంచి 2020-21 వరకూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) 25,267 మంది అభ్యర్థులను, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) 2,14,601 మంది అభ్యర్థులను, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (ఆర్‌ఆర్‌బి) 2,04,945 మంది అభ్యర్థులను ఉద్యోగాల్లో నియమించిందని మంత్రి చెప్పారు.