విధాత:తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం గోవిందరాజస్వామి సింహ వాహనంపై అభయమిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహనసేవ నిర్వహించారు.
మృగాల్లో రారాజు, గాంభీర్యానికి చిహ్నం సింహం. యోగశాస్త్రంలో సింహం వాహనశక్తికి, శీఘ్రగమన శక్తికి మరో రూపు గా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తారు. అనంతతేజోమూర్తి అయిన స్వామివారు రాక్షసుల మనసులో సింహంలా గోచరిస్తారని స్తోత్రవాఙ్మయం కీర్తిస్తోంది. అందుకే ధీరోదాత్తుడైన శ్రీవారు సింహవాహనాన్ని అధిరోహిస్తారు.
అనంతరం ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు. చందనంలతో అభిషేకం జరిపారు.
సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ రవికుమార్ రెడ్డి, ప్రధాన అర్చకులు శ్రీ ఏ.టి.శ్రీనివాస దీక్షితులు, కంకణ బట్టార్ శ్రీ ఏ.టి. పార్థసారధి దీక్షితులు, సూపరింటెండెంట్లు శ్రీ వెంకటాద్రి, శ్రీ కుమార్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునీంద్రబాబు, శ్రీ కామరాజు, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.