Site icon vidhaatha

బెంగాల్‌లో మళ్లీ పెద్దల సభ.. తీర్మానానికి ఆమోదం!

విధాత,కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో శాసనమండలి ఏర్పాటు ప్రక్రియను దీదీ షురూ చేశారు.ఈ మేరకు శాసనసభలో ప్రవేశ పెట్టిన తీర్మానానికి మంగళవారం ఆమోదం లభించింది. రాష్ట్రంలో ఎగువ సభ ఏర్పాటుపై నిర్వహించిన ఓటింగ్‌ సమయంలో సభలో 265 మంది సభ్యులు ఉండగా.. 196 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటేయగా, 69 మంది వ్యతిరేకించారు.ఎన్నికల మేనిఫెస్టోలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల్లో శాసనమండలి ఏర్పాటు కూడా ఒకటి. ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు హ్యాట్రిక్‌ విజయం సాధించి పెట్టినప్పటికీ మమతా బెనర్జీ నందిగ్రామ్‌ నుంచి బరిలో దిగి ఓటమిపాలైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో మండలి ప్రతిపాదనకు ఆమె ఆమోద ముద్ర వేయడంతో పాటు జోరుగా పావులు కదుపుతున్నారు. తాజాగా దీనిపై రూపొందించిన తీర్మానం సభలో ప్రవేశ పెట్టారు. ఓటింగ్‌ సమయంలో దీదీ సభలో లేరు. శాసనమండలి ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ పాత్రే అత్యంత కీలకం. పార్లమెంట్‌లో ఈ బిల్లు ఆమోదం పొందితేనే మండలి ఏర్పాటుకు మార్గం సుగమమవుతుంది.
పశ్చిమబెంగాల్‌లో 1952లో శాసనమండలి ఏర్పాటు చేసినప్పటికీ.. ఆ తర్వాత రద్దైంది. 1969 మార్చి21న అప్పటి ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేయగా మళ్లీ ఇప్పుడు ఆ అంశం తెరపైకి వచ్చింది. దేశంలో ప్రస్తుతం కేవలం ఆరు రాష్ట్రాల్లోనే శాసన మండలి వ్యవస్థ ఉంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు బిహార్‌, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలలో మాత్రమే ఉంది. ఆర్టికల్‌ 370 రద్దుకు ముందు జమ్మూకశ్మీర్‌లో ఉన్నప్పటికీ ఆ తర్వాత రద్దైంది.

Exit mobile version